మహానుభూతి

4

– మెట్రోరైల్లో మంత్రుల సవారీ

– పాతబస్తీ వరకు పొడగిస్తాం

– మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌18(జనంసాక్షి): మెట్రో నిర్మాణం ఓ అద్భుతమని మెట్రోరైలులో ప్రయాణం చేయడం తనకెంతో అనుభూతినిచ్చిందని మంత్రి కెటి రామారావు అన్నారు. ఇతర మంత్రులతో కలసి ఆయన నాగోల్‌ నుంచి ఉప్పల్‌ వరకు ప్రయాణించారు. ఈ  ట్రయల్‌ రన్‌లో భాగంగా మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, డిప్యూటీ సీఎం మహమూద్‌ ఆలీతో కలిసి రైలులో ప్రయాణించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. వేగంగా ప్రయాణికులను గమ్యానికి చేర్చడమే మెట్రో వ్యవస్థ లక్ష్యమన్నారు. మెట్రో కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.3 వేల కోట్లు ఖర్చు పెడుతుందని తెలిపారు. భూసేకరణ ఇతర ఇబ్బందులను అధిగమించి మెట్రో రైలు ప్రాజెక్టును చివరి దశ వరకు తీసుకుని పోవడమే తమ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. త్వరలో భాగ్యనగరంలో మెడలో మెట్రో మెరుపు తీగ మెరవనున్నదన్నారు.  ఈమేరకు మెట్రో రైలు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారని అన్నారు. మెట్రో రైలు ట్రయల్‌ రన్‌ను జరుపుతున్నారు. అంతకు ముందు ఎల్‌ అండ్‌ టీ అధికారులు వారికి ఘనస్వాగతం పలికారు. రైల్వే స్టేషన్‌లో అత్యాధునికి వ్యవస్తను పరిశీలించిన అనంతరం మంత్రులు రైలులో ప్రయాణించారు.  మెట్రో రైలు వ్యవస్థను నగరంలో మరింత విస్తరించాలనే సంకల్పంతో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉన్నారని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.  మెట్రో రెండో దశలో 83 కిలోవిూటర్లు విస్తరణకు ప్రణాళికలు రూపొందించే ఆలోచన ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఇందు కోసం ప్రణాళికలు సిద్దం చేయాలని మెట్రో రైలు సంస్థకు సూచించామన్నారు. నగరంలో మరో 155 కిలోవిూటర్ల మేర విస్తరించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు. మియాపూర్‌-పటాన్‌చెరు వరకు 13 కిలోవిూటర్ల మెట్రో రైలు రానుందని తెలిపారు. ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌ వరకు 7 కిలోవిూటర్ల మెట్రో రైలు, నాగోల్‌-ఎల్బీనగర్‌, ఫలక్‌నుమా-శంషాబాద్‌ 28 కిలోవిూటర్లు, తార్కాక-ఈసీఐఎల్‌ క్రాస్‌రోడ్స్‌ వరకు మెట్రో రైలు మార్గాలు నిర్మించనున్నట్టు వివరించారు. రాయదుర్గం-గచ్చిబౌలి-శంషాబాద్‌ వరకు 28 కిలోవిూటర్లు దూరం మెట్రో రైలు రానుందని తెలిపారు.