మహారాష్ట్ర రాజ్‌ భవన్‌లో దొంగలు

– ఎర్రచందనం చెట్లను నరక్కువెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
– కట్టుదిట్టమైన భద్రత ఉన్నా గుర్తించని సిబ్బంది
– కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
పుణె, మే3(జ‌నం సాక్షి) : మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు అధికారిక నివాసమైన రాజ్‌భవన్‌లో దొంగలు పడ్డారు. పుణె రాజ్‌భవన్‌ పరిసరాల్లోని విలువైన ఐదు ఎర్రచందనం చెట్లను నరికివేశారు. ఎందరో సెక్యూరిటీ సిబ్బంది, మరెన్నో సీసీ కెమెరాల నిఘా నీడలో ఉండే ఈ ప్రాంతంలో ఏప్రిల్‌ 30న కొందరు గుర్తుతెలియని దుండగులు చెట్లమొదళ్ల వరకూ నరికి దుంగలను ఎత్తుకుపోయారు. ఈ సమాచారాన్ని గవర్నర్‌కు తెలియజేశారు. నరికివేతకు గురైన చెట్ల వయసు 8-10సంవత్సరాలు ఉంటుందని, ఒక్కో చెట్టూ సుమారుగా రూ.20వేలు ఉంటుందని రాజ్‌భవన్‌ సిబ్బంది అంచనా వేస్తున్నారు. రెండేళ్ల కాలంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండో సారి. రాజ్‌భవన్‌కు అత్యంత సవిూపంలో పోలీస్‌ స్టేషన్‌ ఉన్నప్పటికీ నిందితుల వివరాలు తెలుసుకోలేకపోతున్నారు. ఈ ఘటనపై చతుశృంగి పోలీస్‌స్టేషన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. సాధారణంగా ఎర్రచందనం అత్యంత విలువైంది కావడంతో సెక్యూరిటీని సైతం లెక్కచేయకుండా ఇలాంటి ఘటనలు తెగబడుతున్నారని రాజ్‌భవన్‌ సిబ్బంది ఒకరు అభిప్రాయపడ్డారు.
మధ్యకాలంలో పుణెలో ఎర్రచందనం చెట్లను నరికేస్తున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉన్న మూడు ఎర్రచందనం చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. ఇదే తరహా ఘటన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ మేనేజ్‌మెంట్‌(ఎన్‌ఐబీఎం)లోనూ చోటు చేసుకుంది.