మహాలక్ష్మిగా దర్శనమిచ్చిన అమ్మవారు

భవానీ భక్తలరాకతో ఇంద్రకీలాద్రిపై రద్దీ
అమ్మవారిని దర్శించుకున్న నటి హేమ
విజయవాడ,అక్టోబర్‌4 (జనంసాక్షి):   ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగు తున్నాయి. ఆరవ రోజు శుక్రవారం అమ్మవారు మహాలక్ష్మిదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజామునుంచే పోటెత్తారు.  రాత్రి 11 గంటల వరకు దర్శనానికి అవకాశమున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులుమొక్కులు తీర్చుకుంటున్నారు. కాగా సీఎం జగన్మోహన్‌ రెడ్డి శుక్రవారం సాయంత్రం అమ్మవారిని దర్శించుకోనున్నారు. రాష్ట్ర మంత్రులు ఓంకారం వద్ద సీఎంకు స్వాగతం పలకనున్నారు. ప్రభుత్వం తరఫున సీఎం ¬దాలో కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇకపోతే ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ దర్శనానికి భవానీ భక్తులు రాక ప్రారంభమైంది. దీక్షల విరమణకు వివిధ ప్రాంతాల నుంచి భవానీ భక్తులు వచ్చారు. అయితే ఏర్పాట్లు సరిగా చేయలేదని, కనీసం మౌలిక వసతులు కూడా అధికారులు కల్పించలేదని గురు భవానీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయమై ఆలయ ఈవోను కలిశారు. అయితే మాల ఎవరు వేసుకోమన్నారంటూ అవమానంగా మాట్లాడారని భవానీలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని భవానీలు కోరుతున్నారు. పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.  కనక దుర్గమ్మను సినీ నటి హేమ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది దసరా ఉత్సవాల ఏర్పాట్లు చాలా బాగున్నాయన్నారు. మహాలక్ష్మీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారి దర్శనం బాగా జరిగిందని, అమ్మవారి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని హేమ తెలిపారు.