మహాసంగ్రామం దిశగా మహోద్యమం అడుగులు
ఒకప్పుడు ఉద్యమం. నిన్నటి వరకు ఓ మహోద్యమం. నేడు ఆ మహోద్యమమే ఓ మహాసంగ్రామం చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలు చేయని ఉద్యమ రూపం లేదు. ఒక ప్రాంతానికి చెందిన నాలుగున్నర కోట్ల ప్రజలు ఒకే ఆకాంక్ష కోసం ఏకధాటిగా ఉద్యమించడం ప్రపంచ చరిత్రలో తెలంగాణ ఉద్యమం తప్ప మరోటి లేదు. ధర్నాలు చేసినా, రాస్తారోకోలు చేసినా, విధులు బహిష్కరించినా, కార్యాలయాలు ముట్టడించినా, నాయకులను దిగ్బంధించినా, ఆఖరికి తాము అసౌకర్యానికి గురైనా తమ ఆకాంక్ష కోసం అన్ని కష్టాలను తట్టుకున్న ఘనత తెలంగాణ ప్రజలది. వాళ్లలో నాటుకున్న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షది. సకల జనుల సమ్మెతో 42 రోజులపాటు కుల, మత, జాతి, వర్గ భేదాలు లేకుండా కదంతొక్కిన తెలంగాణ ప్రజలు లోకం దృష్టిని తమ వైపు తిప్పుకున్న సంగతి తెలిసిందే. కొందరు స్వార్థ రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం అంత ఉధృతంగా సాగిన సకల జనుల సమ్మెను నిర్వీరం చేసినా, ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నామని ప్రకటించి కేంద్రం మాట తప్పినా, సూటిపోటి మాటలతో సీమాంధ్ర నాయకులు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్రలు చేసినా, పాలకులు తెలంగాణను ఎండబెట్టి, ఇక్కడి ప్రజలను అష్టకష్టాలు పెడుతూ నిధులు, నీళ్లు సీమాంధ్రకు కట్టబెట్టి ప్రత్యేక రాష్ట్ర సాధన వేడిని చల్లార్చాలని ప్రయత్నించినా ఏ మాత్రం బెదరక, జంకక తెలంగాణ ప్రజలు తమ ‘లక్ష్యం’ నుంచి చూపుతిప్పలేదు. రాష్ట్రం ఇవ్వాల్సిందేనని ఉద్యమిస్తూనే ఉన్నారు. ఇంతకాలం ‘ఇగ వచ్చె తెలంగాణ.. అగ వచ్చె తెలంగాణ’ అంటూ మభ్య పెట్టిన తమ ప్రజాప్రతినిధుల మాటలను నమ్మి కాసేపు ఉద్యమానికి విరామమిచ్చినా.. మళ్లీ ఇక్కడి తెలంగాణవాదులు, ప్రజలు తెలంగాణ ఐక్యకార్యాచరణ సారథ్యంలో పాలకులతో మహాసంగ్రామానికి కాలుదువ్వేందుకు సిద్ధమవుతున్నారు. తమ ఆకాంక్షను ఎలుగెత్తి ‘పెద్ద పెద్ద గద్దల గద్దెలు’ కదిలించేందుకు కదన కుతూహలంతో ఎగిసిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జేఏసీ నాయకత్వంలో కార్యాచరణను కూడా రూపొందించుకున్నారు. ఆగస్టు 1న ముహూర్తమని నిర్ణయించుకున్నారు. ఆరోజు నుంచి మహోద్యమం సాగించనున్న మహాసంగ్రామం మహామహుల గుండెల్లో గుబులు పుట్టిస్తుందనడంలో ఏ ఒక్క తెలంగాణ బిడ్డకు సందేహం లేదు. గతంలో ‘సకలం’ కలిసి ఉద్యమిస్తేనే సీమాంధ్ర పాలకులకు సమస్తం తడిసిపోయాయి. అంతకన్నా భారీగా ఉద్యమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ఈ పోరాట తాకిడిని తట్టుకునే దమ్ము పాలకులకు ఉందా ? ముమ్మాటికీ లేదన్న సమాధానమే ‘తెలంగాణ’ నోట వినిపిస్తున్నది. తెలంగాణ బిడ్డల పిడికిలి వాటం రుచి చూడక ముందే ‘ఢిల్లీ, గల్లీ’ పాలకులు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చేయాలని జాతీయస్థాయి మేధావి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదే జరిగితే అందరికీ సంతోషం. లేకుంటే ఉన్నది కదా నినాదం..