మహిళను మింగేసిన కొండచిలువ
ఇండోనేషియాలోని మునా ఐలాండ్లో ఘటన
మకస్సార్, జూన్ 16: తోట పనికి వెళ్లిన ఓ మహిళ కొండచిలువకు బలైపోయింది. పంటచేనులోకి వచ్చిన ఒక భారీ కొండచిలువ ఒకటి ఆమెను మింగేసినట్టు ఒకరోజు తర్వాత గుర్తించి.. కొండచిలువను కోసి మరీ మహిళ మృతదేహాన్ని స్థానికులు బయటకు తీసారు. ఈ విషాద ఘటన ఇండోనేషియాలోని మునా ఐలాండ్లో గురువారం జరిగింది. పెర్సియపస్ లావెలా గ్రామంలో వాటిబా అనే 54 ఏండ్ల మహిళ కూరగాయలు కోసేందుకు గురువారం ఇంటి నుంచి కిలోమీటర్ దూరంలోని తన తోటలోకి వెళ్లారు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతికి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెల్లవారి తోటలో వెతుకుతున్న గ్రామస్థులకు కదలలేని స్థితిలో ఉన్న దాదాపు 23 అడుగుల పొడవైన రాకాసి కొండచిలువ కనిపించింది. వాటిబాకు చెందిన చెప్పులు, కత్తి దాని పక్కనే పడివుండటంతో.. ఇదే కొండచిలువ ఆమెను మింగేసివుంటుందని గ్రామస్థులు అనుమానించారు. దాన్ని చంపి కోసి చూడ గా పొట్టలో వాటిబా మృతదేహం కనిపించింది. ఆమె మృతదేహం చెక్కుచెదరలేదని స్థానిక పోలీసు అధికారి చెప్పారు. రాకాసి కొండచిలువలు చిన్నచిన్న జంతువులను మాత్రమే తింటాయని, మనుషుల జోలికి రావడం చాలా అరుదని స్థానికులు చెప్తున్నారు. గతేడాది మార్చిలో సులావేసి దీవిలోని సులుబిరో గ్రామంలో ఓ రైతును కూడా ఇదే మాదిరిగా ఒక కొండచిలువ మింగేసింది.