మహిళలను టార్గెట్ చేస్తూ.. వారికి పీకలదాకా మద్యం తాగించి…
కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్21 (జనంసాక్షి); మహిళలను టార్గెట్ చేస్తూ.. వారికి పీకలదాకా మద్యం తాగించి వాళ్లు అపస్మారక స్థితికి చేరగానే ఆ అమాయక మహిళలను అడవి ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టడం వారి తంతు. వివరాల్లోకి వెళితే, కామారెడ్డి జిల్లా క గాంధారి అడవి ప్రాంతంలో జరిగిన వరుస హత్యలపై బుధవారం కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 7వ తేదీన గాంధారి మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో వాణి అనే మహిళని కాల్చి వేసినట్టు అలాగే, జులై 5 న ప్రమీల అనే మహిళను హత్య చేసినట్లు తెలిపారు.
యశోద అనే మహిళ తన భర్త రమేష్ సహకారంతో వివాహాలు జరిగే చోటికి వెళ్లి సెల్ ఫోన్లు డబ్బులు, బంగారు ఆభరణాలు దొంగతనాలు చేస్తుందని తెలిపారు. దీంతో హత్యలు చేస్తూ బంగారు ఆభరణాలు, డబ్బులు తీసుకునే వారని ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో ఉన్న ముగ్గురు నేరస్తుల్లో వీరమల్లు రమేష్, వీరమల్లు యశోద జంగంపల్లి నివాసులు,వారు అశోక్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరితో పాటు వారు తెచ్చిన బంగారు ఆభరణాలు కొన్న పిన్నోజి రాము అనే వ్యక్తిని బుధవారం గాంధారి మండల కేంద్రంలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
నిందితులు నుండి ఒక శాంట్రో కార్, స్విఫ్ట్ డిజైర్ కారు, 40 తులాల వెండి కడియాలు, 2.5 గ్రాముల బంగారం మాటీలు, 2.9 తులాల బంగారు పుస్తేలు, 4.40 గ్రాముల బంగారు వంక ఉంగరం, 5.80 గ్రాముల బంగారు, కమ్మలు, రెండు సెల్ ఫోన్లు, 5000 రూపాయల నగదు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీన పరచుకున్నామని తెలిపారు. నేరస్తులను కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. నగరంలో ఇప్పటికే సీసీ కెమెరాలు చాలావరకు ఏర్పాటు చేశామని, నిరంతరం నిఘా వేస్తూ హైవే పై పెట్రోలింగ్ చేస్తున్నామని తెలిపారు. కేసును ఛేదించిన డీఎస్పీ ఎల్లారెడ్డి శ్రీనివాసులు, నగర్ సీఐ రామన్, గాంధారి ఎస్సై సాయి రెడ్డి, కానిస్టేబుల్ అశోక్, రవి, రాజు, జానకిరామ్ లను అభినందించారు.