మహిళల డార్మెట్రీల్లో సీసీ కెమెరాలు 

– దుర్గగుడిలో మరో వివాదం
– సిబ్బందితో భక్తుల వాగ్వాదం
– డార్మెట్రీలు విశ్రాంతి కోసమేనన్న ఆలయ ఈవో పద్మ
– సీసీ కెమేరాలు తొలగిస్తామన్న పాలకమండలి సభ్యుడు ధర్మారావు
– బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడి
విజయవాడ, జూన్‌25(జ‌నం సాక్షి ) : బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం ఇటీవల వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. తాజాగా దుర్గగుడికి వచ్చే భక్తుల కోసం నిర్మించిన డార్మెట్రీలలో సీసీటీవీలు ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది. దుర్గగుడి తరుపున వన్‌టౌన్‌లోని సీవీ రెడ్డి ఛారిటీస్‌లో ఈ డార్మెట్రీలను నిర్మించారు. ఉచిత డార్మెట్రీలతో పాటు ఏసీ డార్మెట్రీలను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఈ శీతల డార్మెట్రీలు ఉన్నాయి. అయితే మహిళల డార్మెట్రీలో సీసీ కెమెరాలు ఉండటంపై సోమవారం కొందరు భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. డార్మెట్రీలలో మహిళలు దుస్తులు మార్చుకోవడానికి ఇబ్బందిగా ఉందని అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయితే సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ వాటి నుంచి దృశ్యాలు రికార్డు చేయడం లేదని అధికారులు చెబుతున్నారు. డార్మెట్రీల నిర్మాణ సమయంలో అన్నిచోట్లా ఏర్పాటు చేసినట్లే అక్కడ కూడా సీసీ కెమేరాలు బిగించామని దేవస్థానం అధికారులు తెలిపారు. డార్మెట్రీలు కేవలం విశ్రాంతి కోసమే తప్ప దుస్తులు మార్చుకునేందుకు కాదని ఈవో పద్మ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే వివాదం గురించి తెలుసుకున్న దుర్గగుడి పాలకమండలి సభ్యుడు ధర్మారావు అక్కడికి చేరుకున్నారు. మహిళా డార్మెట్రీలో సీసీ కెమెరాలు అమర్చడం పొరపాటేనని అంగీకరించారు. ఈ విషయం ఈ రోజే తమ దృష్టికి వచ్చిందని, వాటిని తొలగించడంతో పాటు బాధ్యులపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటుపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని అధికారుల దృష్టికి కొద్దిరోజుల క్రితమే తీసుకెళ్లామని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు సీసీ కెమెరాలు రికార్డు చేయడం లేదని అధికారులు చెబుతున్నా కెమెరాల వద్ద లైట్లు వెలుగుతుండటంతో భక్తులకు అనుమానం వచ్చి గొడవకు దిగారు. అయితే సీసీ కెమేరాల కంట్రోల్‌ రూమ్‌లో మాత్రం ఆ కెమెరాల దృశ్యాలు రికార్డు కావడం లేదని కనిపిస్తోంది.