మహిళల రక్షణ, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

¬ంమంత్రి సుచరిత

అమరావతి,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): అసెంబ్లీలో మహిళల భద్రతపై స్వల్పకాలిక చర్చలో ¬ం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లను నియమించామని.. శాంతి భద్రతలను నివారించడంలో సహాయపడతారని మంత్రి స్పష్టం చేశారు. మహిళల రక్షణ, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆత్మహత్యలు, ఒత్తిడి నిర్వహణ అంశాలపై కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరీ ముఖ్యంగా మిస్సింగ్‌ కేసులు, బాల్య వివాహాల నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని అసెంబ్లీ వేదికగా మంత్రి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మహిళల రక్షణకోసం ‘మహిళా మిత్రభాగం’ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మహిళల రక్షణకు ఎపి రోల్‌ మోడల్‌గా ఉండాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. సిఎం జగన్‌ కూడా ఇద్దరు ఆడపిల్లల తండ్రి అన్నారు. అంతకుముందుక జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి రెండు బెత్తం దెబ్బలు వేయాలంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిచారు. చరిత్రలో రెండు చోట్ల ఓడిపోయిన ఏకైక నాయకుడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేప్‌ చేస్తే రెండు బెత్తం దెబ్బలు వేయాలన్న వ్యక్తి.. గన్‌ పట్టుకుని వీధుల్లోకి ఎందుకు వచ్చాడని ప్రశ్నించారు. తన అక్కను ఏదో అన్నారని చంపేద్దామనుకున్నానని ఇంటర్వ్యూలో పవన్‌ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే స్పీకర్‌ తమ్మినేని కల్పించుకొని.. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడొద్దని సూచించారు. దీంతో తన మాటలను ఉపసంహరించుకున్న ఆమె.. జనసేన ఎమ్మెల్యే ద్వారా ఆయనకు తెలుపుతున్నానన్నారు.