మహిళల సింగిల్స్ ఫైనల్‌లో షరపోవా స్వర్ణం కోసం సెరేనాతో ఢీ
లండన్, అగస్టు 4 : రష్యా అందాల భామ మరియా షరపోవా లండన్ ఒలింపిక్స్ మహీళల సింగిల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఏకపక్షంగా సాగిన సెమీస్‌లో ఆమె 6-2, 6-3 తేడాతో మరియా కిర్లింకోపై విజయం సాధించింది. షరపోవా కెరీర్‌లో ఒలింపిక్స్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. ఇటీవలి ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి ఫామ్‌లో ఉన్న ఈ రష్యన్ బ్యూటీ లండన్‌లోకనూ తన జోరు కొనసాగిస్తోంది. సెమిస్‌లో కిర్లింకోపై పూర్తి ఆధిపత్యం కనబరిచి ఈజీ విక్టరీ కొట్టింది. ప్రస్తుతం షరపోవా ఫైనల్‌కు చేరడంతో పతకం ఖాయమైనా….తాను స్వర్ణం గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆమె చెప్పింది. అటు మరో సెమీఫైనల్ కూడా ఏకపక్షంగానే సాగింది. అమెరికా నల్లకలువ సెరినా విలియమ్స్ 6-1, 6-2 తేడాతో వరల్డ్ నెంబర్ వన్ విక్టోరియా అజరెంకాపై గెలుపోందింది. టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన అజరెంకా ఈ మ్యాచ్‌లో సెరెనాకు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. ఆమె పవర్‌పుల్ షాట్లకు సునాయాసంగా తలవంచింది. వింబుల్డన్ కోర్టులలో మంచి రికార్డు ఉన్న సెరెనా గత నెల నుండి ఇప్పటి వరకూ 12 మ్యాచ్‌లలో వరుస విజయాలు సాదించింది. ఐదు రౌండ్లలో కేవలం 16 గేమ్స్ మాత్రమే కోల్పోయింది. సింగిల్స్‌లో ఇప్పటి వరకూ ఒలింపిక్ మెడల్ గెలవని సెరెనా గతంలో తన చెల్లి వీనస్‌తో కలిసి డబుల్స స్వర్ణాలు సాధించింది.