మహిళా కార్యక్రమాలకు పోటీ పడ్డ సంస్థలు

నిజామాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): జిల్లాలో ఆదివారం మహిళాదినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వ హించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోమహిళా శిశు సంక్షేమం, అనుబంధ శాఖల ఆధర్యంలో జరిగిన ర్యాలీని జాయింట్‌ కలెక్టర్‌ రవీందర్‌ రెడ్డి ప్రారంభించారు. ర్యాలీ కలెక్టరేట్‌ నుంచి బస్టాండ్‌ విూదుగా గాంధీచౌక్‌ వరకు సాగింది. ఈ సందర్భంగా మహిళలకు భద్రత పెంచాలని నినాదాలు చేశారు. అధికారులు, స్వచ్ఛందసంస్థలు, మహిళా సంఘాల నాయకులు కూడా ర్యాలీలు తీశారు. వివిధ పార్టీల మహిళా విభాగం నాయకుల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిం చారు. మహిళ దినోత్సవం సందర్భంగా పలు పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.  కార్యక్రమాల్లో వక్తలు మాట్లాడుతూ…. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని చట్టాలు తెచ్చినప్పటికీ మహిళలకు రక్షణ ప్రశ్నా ర్థకంగా మారిందన్నారు. ఆడపిల్ల ఎక్కడో ఒకచోట దాడులు, అఘాయిత్యాలు జరగడం సర్వసాధారణం అయిందన్నారు. ముఖ్యంగా అత్యాచారఘటనలో నిందితులు కూడా మహిళలను కించ పరుస్తూ మాట్లాడటం దారుణమన్నారు. మహిళ లేకుండా సమాజం ముందుకువెళ్లలేదని, ఈ విషయాన్ని పురుషాధిపత్యం గ్రహించాలని మహిళా సంఘాల నాయకులు పేర్కొన్నారు. గిరిజన విద్యార్థి వసతి గృహాంలో మహిళా దినోత్సవం జరిపారు. విూసాల ఫౌండేషన్‌వ్యవస్థాపక అధ్యక్షుడు విూసాల శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ… సమాజంలో విద్య ఎంతో ముఖ్యమని, మహిళలు చదువుకోవడం కుటుంబానికే లాభమన్నారు. ఉన్నత శిఖరాలను అందుకున్న మహిళలను ఆదర్శంగా తీసుకుని మిగతా వారు అభివృద్ధి సాధించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు పలు పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అప్నా మహిళా మండలి ఆధ్వర్యంలో మాతృ వృద్దాశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. వృద్ధులకు పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు అయేషా ఫాతిమా,  సభ్యులు నూర్జహాన్‌, మైసమ్మ, ఆశమ్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీలోనూ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. యూనివర్సిటీ మహిళా విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ నందిని కార్యక్రమంలో మాట్లాడుతూ మహిళల రక్షణకు ఇప్పుడున్న చట్టాలు సరిపోవని, మరిన్ని ప్రత్యేక చట్టాలు రూపొం దించి వాటి అమలుకు సరైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. చదువుకునే సమయంలోనే విద్యార్థులకు నైతిక విలువలు పెంచేవిధంగా బోధన ఉండాలన్నారు. అందుకణుగుణంగా విద్యా విధానంలో మార్పులు కూడా రావాలని పేర్కొన్నారు. స్వామివివేకాందుడిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకుపోవాలన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో పని చేస్తున్న మహిళా సిబ్బందిని సన్మానించారు.