మాకు బలంలేదు.. అందుకే పోటీచేయలేదు

` హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉన్నాం
` హైడ్రా, మూసీ, హెచ్‌సీయూ భూముల పేరుతో ప్రభుత్వం అరాచకాలు
` 17 నెలల్లో తెలంగాణకు భాజపా ఒక్క పైసా పని చేయలేదు
` మతం పేరిట రాజకీయాలను రాష్ట్ర ప్రజలు ఆమోదించరు: కేటీఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌కు భారాస దూరంగా ఉంటుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన గ్రేటర్‌ హైదరాబాద్‌ భారాస నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. బలం లేదు కాబట్టే అభ్యర్థిని పోటీలో పెట్టలేదని చెప్పారు. ఎన్నికకు హాజరు కావద్దని పార్టీ తరఫున విప్‌ కూడా జారీ చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీకి కాంగ్రెస్‌, భారాస దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ‘’కాంగ్రెస్‌, తెదేపా, భాజపాను ఎదుర్కొని కేసీఆర్‌ పార్టీ పెట్టారు. కేసీఆర్‌ దీక్ష, పోరాటంతోనే తెలంగాణ వచ్చింది. ప్రజలు ఏ పాత్ర ఇచ్చినా భారాస సమర్థంగా పోషిస్తుంది. చేసినవి చెప్పుకోనందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. 17 నెలల్లో భారాస గ్రాఫ్‌ బాగా పెరిగింది. ప్రస్తుత ప్రభుత్వం హైడ్రా, మూసీ, హెచ్‌సీయూ భూముల పేరుతో అరాచకాలు చేస్తోంది. రాష్ట్ర భాజపా ఎంపీలు కాంగ్రెస్‌ను ఒక్క మాట కూడా అనరు. 17 నెలల్లో తెలంగాణకు భాజపా ఒక్క పైసా పని చేయలేదు. హెచ్‌సీయూ భూములపై మోదీ ఎందుకు విచారణ జరిపించట్లేదు? తెలంగాణ కాంగ్రెస్‌, భాజపా ఒక్కటే. మతం పేరిట రాజకీయాలను తెలంగాణ ప్రజలు ఆమోదించరు’’ అని కేటీఆర్‌ తెలిపారు.

 

తాజావార్తలు