మాఘ పౌర్ణమి రోజున పోటెత్తిన కుంభమేళ

అలహాబాద్‌, ఫిబ్రవరి 25 (జనంసాక్షి):
మాఘపౌర్ణమి పర్వదినం సందర్భంగా సోమవారంనాడు మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ఈ తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. మాఘపౌర్ణమి సందర్భంగా కోటిమంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. భక్తులను ఎప్పటికప్పుడు స్నానఘాట్‌ నుంచి బయటకు పంపుతున్నారు. ఎలాంటి ఒత్తిడి, తొక్కిసలాట జరగకుండా ప్రత్యేకంగా రహదారులను ఏర్పాటు చేశారు. మౌని అమావాస్య సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 10న మౌని అమావాస్య సందర్భంగా భక్తులు భారీ ఎత్తున తరలి రావడంతో అలహాబాద్‌ స్టేషన్‌లో తొక్కిసలాట జరిగి 37మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ అనుభవం దృష్ట్యా రైల్వే స్టేషన్‌లోనూ, సమీప కూడళ్లలోనూ అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా కుంభమేళాకు భారీ ఎత్తున భక్తులు తరలిరావడంతో పవిత్ర గంగానదికి కాలుష్యం తగిలే ప్రమాదం ఉందని గంగా నది పరిరక్షణ సమితి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలి రావడం, అక్కడే వ్యర్థాలు పేరుకుని పోయి అశుభ్రవాతావరణం నెలకొందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి గంగానది ప్రక్షాళనకు పూనుకోవాలని వారు కోరారు