మాజీ సిఎంలకు బంగాళాల కేటాయింపు రాజ్యాంగ విరుద్దం

సుప్రీం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ,మే7(జ‌నం సాక్షి):  మాజీ ముఖ్యమంత్రులకు ప్రభుత్వ బంగళాలు మంజూరు చేస్తూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం చెల్లదని సుప్రీంకోర్టు సోమవారంనాడు తీర్పునిచ్చింది. ప్రభుత్వ బంగళాల కేటాయింపునకు మాజీ ముఖ్యమంత్రులు అర్హులు కారని అత్యున్నత న్యాయస్థానం తన ఆదేశంలో స్పష్టం చేసింది. యూపీ సర్కార్‌ తీసుకువచ్చిన చట్టాన్ని కొట్టివేసింది. ‘ఉత్తర ప్రదేశ్‌ మంత్రుల చట్టం 2016లోని సెక్షన్‌ 4(3) రాజ్యాంగ విరుద్ధం’ అని కోర్టు పేర్కొంది. 2016 ఆగస్టులో అఖిలేష్‌ యాదవ్‌ సారథ్యంలోని యూపీ సర్కార్‌ ఈ చట్టం తీసుకువచ్చింది. దీనిని లోక్‌ ప్రహరి స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేసింది.