మాటల యుద్ధం!


– తొలిరోజే వాడీవేడిగా అసెంబ్లీ సమావేశాలు
– విద్యుత్‌ ఒప్పందాలపై అసెంబ్లీలో రగడ
– ఆరునెలల్లో పీపీఏలపై ఏంచేశారు?
– కమిటీవేసి గందరగోళాన్ని సృష్టిస్తున్నారు
– ప్రభుత్వం తీరుతో రాష్టం విద్యుత్‌ సమస్యతో అల్లాడుతుందన్న టీడీపీ
– ఈ పరిస్థితికి గత ప్రభుత్వమే కారణమని వైకాపా కౌంటర్‌
అమరావతి, డిసెంబర్‌9(జ‌నంసాక్షి) : ఏపీ అసెంబ్లీ తొలిరోజే వైకాపా, టీడీపీ సభ్యుల మాటల దాడితో దద్దరెల్లిపోయింది. సభ ప్రారంభంకాగానే.. ప్రశ్నోత్తరాల సమయంలో అధికార-ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడిచింది. విద్యుత్‌ రంగంలో గోపాల్‌రెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రభుత్వాన్ని టీడీపీ ప్రశ్నించింది. గత ప్రభుత్వ హయాంలో పీపీఏలో ఎలాంటి అవకతవకలు జరగలేదని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. పీపీఏలపై కమిటీలు వేసి గందరగోళం పరుస్తున్నారని..
ఈ ప్రభుత్వ విధానాల వల్ల పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆరు నెలలు ఏం చేశారని ప్రశ్నించారు. రామానాయుడు ప్రశ్నకు ఆర్థిక మంత్రి బుగ్గన సమాధానం ఇచ్చారు. కేబినెట్‌ సబ్‌ కమిటీ అన్నింటినీ పరిశీలిస్తోందని, అన్ని పరిశీలించి తగిన సమయంలో నివేదిక సమర్పిస్తుందని మంత్రి తెలిపారు. లక్ష్యాలను దాటి గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని, 15రోజుల్లో 41 పీపీఏలు చేసుకున్నారని ఆరోపించారు. వాడినా వాడకున్న పీపీఏల కింద డబ్బులు కట్టాల్సిందేనని, దాని వల్ల డిస్కంలను అప్పుల్లో ముంచారన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక గత నెల డిస్కంలకు రూ.4,900 కోట్లు ఇచ్చామని బుగ్గన తెలిపారు. గత ప్రభుత్వం డిస్కంలను ముంచేసిందని, వాస్తవాలను టీడీపీ నేతలు జీర్ణించుకోవడం లేదన్నారు. గత పదేళ్లలో రూ.20వేల కోట్ల నష్టాల్లోకి తెచ్చారని, డిస్కంలు మొత్తం కుప్పకూలే స్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు. పవర్‌ కంపెనీలకు రూ.10వేల కోట్ల సబ్సిడీ ఇవ్వాల్సి వస్తోందని, రూ.9వేల కోట్ల నుంచి రూ.29వేల కోట్లకు అప్పు తీసుకొచ్చారన్నారు.
తన సీటు మార్చండి!
మంత్రి బుగ్గన సమాధానం ఇచ్చిన తర్వాత.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడే అవకాశం ఇవ్వాలని టీడీపీ పట్టు పట్టింది. ప్రశ్నోత్తరాల సమయంలో ఇలా సభను అడ్డుకోవడం సరికాదని.. తర్వాత అవకాశం ఇస్తామని స్పీకర్‌ తమ్మినేని వారించినా ప్రతిపక్ష సభ్యులు వెనక్కు తగ్గలేదు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి కలగజేసుకొని ప్రశ్నోత్తరాల సమయంలో ఇలా సభను అడ్డుకొని, నిరసన అనడం సరికాదన్నారు. సభా సంప్రదాయాలను పాటించాలన్నారు. ఈ క్రమంలో అరాచక శక్తులంటూ ప్రతిపక్షం చేసిన వ్యాఖ్యలపై ఆనం అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు తమను అరాచక శక్తులు అంటారా అని మండిపడ్డారు. దయచేసి నా సీటు మార్చండి సార్‌.. సభ్యులు ఎవరైనా మాట్లాడితే మాట్లాడుతాను కానీ.. ప్రతిపక్ష నేతే నా పక్కన నిలబడితే నేనేం మాట్లాడగలను సార్‌.. ఆయన నా పక్కన నిల్చున్నా.. కూర్చున్నా మాట్లాడేంత ధైర్యం, శక్తి నాకుందా సార్‌.. వారి ముందు నేను చాలా చిన్నవాణ్ణి.. వారొచ్చి నా పక్కన నిల్చుంటే నేనేం మాట్లాడగలను అంటూ ఆనం చంద్రబాబుపై సెటైర్లు వేశారు. దయచేసి అరాచక శక్తులు అనే పదం వారు ఉపసంహరించుకోమని చెప్పండి లేదా విూరైనా (స్పీకర్‌) రికార్డ్స్‌లో నుంచి తొలగించండని ఆనం ఒకింత సెటైరికల్‌గా మాట్లాడారు. అయితే ఆనం మాట్లాడుతున్నంత సేపు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నవ్వుతూనే ఉన్నారు. మరోవైపు.. వైసీపీ సభ్యులు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా చంద్రబాబు వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు క్షమాపణ చెప్పాలని కోరారు. దీంతో స్పీకర్‌ కల్పించుకొని అరాచక శక్తులు అన్న పదాన్ని అసెంబ్లీ రికార్డుల నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించటంతో వివాదం సర్దుమనిగింది.