మాడ్‌పై మహా యుద్ధం

మావోయిస్టుల నాలుగడుగుల వెనక్కి వ్యూహం
కొత్త ప్రాంతాలకు తరలే అవకాశం..!!
నిలిచి ఉండాలంటే వెనుకడుగు వేయడమే తక్షణ మార్గం
పీపుల్స్‌ గెరిల్లా ఆర్మీ బెటాలియన్లు, కంపెనీల ఉపసంహరణ తాత్కాలిక ఎత్తుగడ
గుప్పెడు అబుజ్‌మడ్‌ అడవుల్లో 64వేల అర్ధసైనిక బలగాలతో జల్లెడ
ఆత్మరక్షణలోకి వెళ్లక తప్పదు
హైదరాబాద్‌, అక్టోబర్‌ 5 (జనంసాక్షి)
నాలుగడుగులు వెనక్కి.. ఆరడుగులు ముందుకి.. నగ్జల్బరీ నుంచి మావోయిస్టు పార్టీగా మారేవరకు ఆ పార్టీ అనుసరించిన వ్యూహం..! 1960వ దశకంలో గుప్పెడుమంది దున్నేవాడికి భూమి కావాలనే నినాదంతో పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని డార్జెలింగ్‌ జిల్లా నగ్జల్బరీ గ్రామంలో చారుమొజుందార్‌ నేతృత్వంలో లేచిన ఓ గొంతుక ఉప్పెనై ఎగిసిపడిరది. దాని నిర్మూలనకు అప్పటి సీపీఎం సర్కారు ఎక్కువ సమయమేమీ పట్టకపోయినా.. అక్కడ్నుంచి లేచిన ఓ నిప్పురవ్వ శ్రీకాకుళం మీదుగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వ్యాపించడం పీడితవర్గాలకు బాసటైంది. ఉత్తర తెలంగాణే తన ఠికాణాగా పీపుల్స్‌ వార్‌ పేరుతో దొరల దౌర్జన్యాన్ని వెట్టిచాకిరీని, గడీలపై తిరుగుబాటును, అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ ‘‘దొర ఏందిరో.. వాని పీకుడేందిరో’’ అంటూ గ్రామగ్రామాలకూ విస్తరించింది. అన్యాయాన్ని ఎదురిస్తూ అణగారిన వర్గాలకు మరింత చేరువైంది. దశాబ్దాల తన ఉద్యమానికి దారులు వేసుకుని.. అడవినే కేంద్రంగా మలుచుకొని.. నేడు ముప్పేట చుట్టుముడుతున్న ముప్పును దాటేందుకు ‘నాలుగడుగుల వెనక్కి’ వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.
2004లో అప్పటి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంతో చర్చల సందర్భంగా సీపీఐ(ఎంఎల్‌) పీపుల్స్‌ వార్‌ కాస్త సీపీఐ మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించింది. ఒరిస్సా ప్రాంతంలో బలమైన పట్టుగలిగిన పార్టీ యూనిటీ ఉత్తర భారతదేశంలో పట్టుగలిగిన మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ (ఎంసిసి) పీపుల్స్‌ వార్‌ కేంద్ర కమిటీ కార్యదర్శి గణపతి నాయకత్వాన్ని ఆమోదించి హైదరాబాద్‌ కేంద్రంగా సీపీఐ మావోయిస్టు పార్టీగా అవతరించింది. తెలంగాణలో తీవ్రమైన ఎదురుదెబ్బలు ఆధునిక టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో తన రూట్‌ మార్చుకుని, మొత్తం ఉద్యమాన్ని దండకారణ్యం కేంద్రంగా ప్రకటించుకుంది. అబూజ్‌మడ్‌ అడవుల్లో పట్టుసాధించి ఆ ప్రాంతాన్ని విముక్త ప్రాంతంగా ప్రకటించుకుని, భద్రతా బలగాలకు సవాల్‌ విసురుతూ ఓ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని జనతన సర్కారు పేరుతో ఏర్పాటుచేసుకుంది. ఆదివాసీల తలలో నాలుకగా వారి కనీస సౌకర్యాలు విద్యా, వైద్యం, వ్యవసాయం, జల్‌ జమీన్‌ జంగిల్‌ ఇన్‌సాఫ్‌ నినాదంతో ఆదివాసీల్లో తనదైన ముద్రవేసుకుంది. ఏకంగా మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు పది బెటాలియన్లు, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీని నిర్మించుకుంది.  జనతన సర్కార్‌ మంత్రిత్వ శాఖలతో ఆదివాసీలకు పోడు వ్యవసాయం, వడ్డీలేని రుణాలు ఆదివాసీ హిందీ భాషలతో మిలితమైన కొత్త సెలబస్‌తో పాఠశాలలు బేర్‌హుడ్‌ డాక్టర్లతో వైద్యశాలలను ఏర్పాటుచేసుకుని ప్రజల కనీస అవసరాలను తీరుస్తూ ముందుకెళ్తోంది. స్వతంత్ర భారతదేశంలో మరో విముక్త ప్రాంతాన్ని సహించని కేంద్ర సర్కార్‌.. దేశాన్ని మావోయిస్టుల రహిత దేశంగా మారుస్తామని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించుకుని ముందుకెళ్తున్నారు. చెప్పినట్టుగానే అడవుల్లో కేంద్ర వాయుసేనకు చెందిన హెలీకాప్టర్లు ప్రతి ఐదు కిలోమీటర్లకు ఓ పోలీస్‌ క్యాంపు ఏర్పాటుచేసుకుని అబుజ్‌మడ్‌ అడవులపై యుద్ధాన్ని ప్రకటించింది. ఆపరేషన్‌ కగార్‌ పేరిట మొదలైన యుద్ధంలో 200 మంది మావోయిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు చనిపోయారు.
నష్టనివారణ వ్యూహం..!!
నిన్నా మొన్నటివరకు గూగుల్‌ కూడా గుర్తించని అబుజ్‌మడ్‌ అడవులను 64వేల మంది అర్ధసైనిక బలగాలు చుట్టుముడుతున్నాయి. దండకారణ్యం చుట్టూ దట్టమైన అడవులను జల్లెడ పడుతున్న సమయంలో దళాలు ఆత్మరక్షణలోకి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కాకలు తీరిన కమ్యూనిస్టు యోధులు కేంద్ర కమిటీల్లో ఉండగా.. పార్టీ నేతృత్వంలో మొత్తం పది బెటాలియన్లు, కేంద్ర కమిటీలో 11 మంది తెలుగువారు ఉండటం గమనార్హం. అయినప్పటికీ ఎల్‌టీటీఈ వంటి స్టాండిరగ్‌ ఆర్మీ కాదు మావోయిస్టు పార్టీ. స్టాండిరగ్‌ ఆర్మీలాగా నిలబడి పోరాడాలన్నది కూడా ఆ పార్టీ సిద్ధాంతం కానే కాదు. అవసరమైన మేరకు యుద్ధాన్ని అనివార్యంగా తప్పించి నష్టనివారణే వ్యూహంగా ముందుకు కదలాలి. ప్రజాపోరాటంలో నిలిచి ఉండాలంటే వెనుకడుగు వేయడం తప్ప మరో మార్గం లేదు. పీపుల్స్‌ గెరిల్లా ఆర్మీ బెటాలియన్లు, కంపెనీలు ఉపసంహరించుకోవాలి. సుదీర్ఘ ప్రజా విప్లవ ఉద్యమంలో ఇప్పటివరకు కొనసాగించిన వ్యూహాలను మావోయిస్టు పార్టీ పున:సమీక్షించుకోవాల్సిన సమయమిది. గుప్పెడంత గల కీకారణ్యంలో వేల బలగాలు మోహరిస్తున్న దరిమిలా అత్యంత వ్యూహాత్మకంగా మావోయిస్టులను ఒక్కచోటు చేర్చేవిధంగా సాగుతున్నాయి. ఇప్పటికే నిరంతర కూంబింగ్‌, పకడ్బందీ నిఘాతో భారీ ఎన్‌కౌంటర్లు చేపడుతోంది. కేంద్ర కమిటీలో ఉన్న 16 మంది సభ్యుల్లో అత్యధికులు కూడా ఏడు పదుల వయస్సు మళ్లినవారే కాబట్టి వారిని మట్టుబెట్టి మావోయిస్టు పార్టీని కోలుకోలేని దెబ్బతీయాలని భద్రతా బలగాలు భావిస్తున్నాయి.
‘ఆపరేషన్‌’ను తిప్పికొడతారా..?
సరళీకృత ఆర్థిక విధానాలు మొదలైన తర్వాత గిరిజన ఆదివాసీల హక్కుల రక్షణ కోసం మావోయిస్టులు ప్రజామద్దతు కూడగట్టారు. అభివృద్ధి పేరిట జరిగే విధ్వంసాన్ని అడ్డుకునేందుకు ప్రజలతో కలిసి ప్రతిఘటనా పోరాటాలు చేశారు. వీటికి అన్నివర్గాల మద్దతు కూడా తోడైంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులను తుదముట్టించాలనే లక్ష్యంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పలుమార్లు ‘ఆపరేషన్‌’ కొనసాగించింది. 2017లో ఆపరేషన్‌ సమాధాన్‌ మొదలుపెట్టి, 2021 నాటికి మావోయిస్టు దేశంగా మారుస్తామని భారీస్థాయిలో ఆయుధాలు, నిధులు కేటాయించారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. అనంతరం ఈయేడు జనవరి నుంచి ప్రారంభించిన ‘ఆపరేషన్‌ కగార్‌’ 2026 వరకు కొనసాగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పదేపదే చెప్పడం, తరచూ జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో భారీ సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తుండటం ఆ పార్టీకి తీరని నష్టం వాటిల్లుతోంది. శుక్రవారం అబుజ్‌మడ్‌ అడవుల పరిధిలోని దంతెవాడ జిల్లాలో జరిగిన ఘటనలో 30 మందికిపైగా మావోయిస్టులు మృతిచెందగా.. ఈ ఒక్క ఏడాదిలోని ఇప్పటివరకు మృతుల సంఖ్య 200 మందికి చేరింది. నేటికీ మావోయిస్టులకు అనువైన ప్రాంతంలోకి వేల సంఖ్యల్లో భద్రతా బలగాలు చొచ్చుకెళ్తుండటం వెరసి ఆ పార్టీ తన వ్యూహాన్ని మార్చుకుని నష్టనివారణకు కొత్త పంథాను అనుసరించాల్సిందే..!
తుపాకీ బూచీగా ‘రాజ్యం’ ఆమోదం!
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) 20వ స్థాపన వార్షికోత్సవాల వేళ బస్తర్‌ అడవుల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రతి ఒక్కరినీ కలిచివేస్తున్నాయి. రెండు దశాబ్దాల కాలంలో అనేక కష్టనష్టాలను ఎదుర్కొని పీడిత ప్రజల విముక్తి కోసం అనేక త్యాగాలు, విజయాలను సమరోత్సాహంతో సమీక్షించుకోవాలని తలపెట్టిన వార్షికోత్సవాల సమయంలో అబుజ్‌మడ్‌ ప్రాంతంలో కాల్పుల మోత ఉలిక్కిపడేలా చేసింది. ఆ పార్టీ చరిత్రలోనే అతిపెద్ద ఎన్‌కౌంటర్‌ జరిగి ముప్పై మందికిపైగా ప్రాణాలు కోల్పోయింది. సాయుధ పోరాటం ద్వారా రాజ్యాధికారంలోకి రావాలని ఎంచుకున్న మావోయిస్టులను అదే తుపాకీ బూచీ చూపెట్టి కేంద్ర సర్కార్‌ అంతమొందించాలనుకుంటోంది. వందలాది మందిని చంపుతూ వారినుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లను ముక్తకంఠంతో ఖండిస్తున్న పౌర హక్కుల సంఘాలు సుప్రీం కోర్టు జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేయడం, ఆ తర్వాత చల్లబడటమూ పరిపాటిగా మారింది. దట్టమైన అడవుల్లో జరుగుతున్న విధ్వంసకాండ బారినుంచి అమాయక ఆదివాసీ, గిరిజనులను రక్షించుకోవడంతో పాటు ఆ పార్టీ మూలసిద్ధాంతాన్ని మావోయిస్టులు గుర్తెరగాలని ముక్తకంఠం వినిపిస్తోంది.

తాజావార్తలు