మాదక ద్రవ్యాల వినయోగంపై యుద్దం
ప్రజల్లో చైతన్యం కోసం విశాఖలో భారీ ర్యాలీ
విశాఖపట్నం,జూన్26(జనం సాక్షి): మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా ద్వారా చిక్కుల్లో చిక్కుకోవద్దని పలువురు నినదించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి భవిష్యత్‌ను కాపాడుకుందామని నినాదాలు చేశారు. మన భవిస్యత్‌కు ముప్పుగా పరిణమించిన మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డులో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. వైఎంసీఏ నుంచి నోవాటెల్ ¬టల్ వరకు సాగిన ర్యాలీలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ కమిషనర్ లక్ష్మీ నరసింహం, ప్రొహిబిషన్ డైరక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, ఎక్సైజ్ శాఖ సిబ్బంది సహా పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం కారణంగా జరిగే నష్టాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ ముందుకు సాగింది. విశాఖ జిల్లాలో గంజాయి అక్రమ సాగు, రవాణాను అడ్డుకునేందుకు మరింత కఠిన చర్యలు తీసుకోవడం సహా ఆ ప్రాంతంలోని వారికి లాభసాటిగా ఉండే ప్రత్యామ్నాయ పంటలను చేరువ చేసేందుకు కృషి చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా యువత పెడదారిన పడరాదన్నారు.