మామునూరులో వెటర్నరీ కాలేజీ


ప్రారంభించిన డిప్యూటి సిఎం కడియం
వరంగల్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి):  జిల్లాలో మామునూర్‌ వెటర్నరీ కాలేజీని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఈ కాలేజీ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా ఇక్కడ వెటర్నరీ కాలేజీని ప్రారంభించా లనుకున్నాను కాలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ వరంగల్‌ వచ్చినపుడు వరంగల్‌ ని ఎడ్యుకేషన్‌ హబ్‌ గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అప్పుడే వెటర్నరీ కాలేజీ మంజూరు చేశారు. గత ఏడాది దీనిని ప్రారంభించాలి అనుకున్నా కేంద్రంలో వెటర్నరీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పాలక వర్గం లేనందున అనుమతులు రాకపోవడంతో ఈ ఏడాది ప్రారంభించుకుంటున్నాం. ఈ కాలేజీ ప్రారంభించడానికి వీసీ, రిజిస్ట్రార్‌ నిరంతర కృషి కారణం అన్నారు.  ఈ కాలేజీలో ఏ రకమైన సాయం కావాలన్నా ప్రభుత్వ పరంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ కాలేజీని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్టాల్రలో నెంబర్‌ వన్‌ గా ఉండాలి. వెటర్నరీ విద్యకు, వైద్యులకు రాబోయే రోజుల్లో మహర్దశ ఉంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పశు పోషణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే దీనికి కారణం. పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని పాల ఉత్పత్తి దారుల సహకార సంఘాల్లోని 2.13 లక్షల మంది రైతులకు ఉపయోగపడాలని పాలధరను కూడా లీటర్‌ కి 4 రూపాయలు పెంచి కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం మనది. పెద్ద ఎత్తున చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం చేయాలని సీఎం కేసీఆర్‌ అనేక పథకాలు అమలు చేస్తున్నారు. వెటర్నరీ కాలేజీ విద్యార్థులు చాలా ప్రతిభావంతులు. వీరి అవసరం చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఆడపిల్లల విద్యను తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఇటీవల అన్ని రకాల పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధిస్తుంది ఆడపిల్లలే. వెటర్నరీ కాలేజీ విద్యార్థులు ఇక్కడికి రావడానికి బస్సు కావాలన్నారు. ఆ బస్సును నా  ఎమ్మెల్సీ నిధుల ద్వారా కోనిస్తాను అని కడియం శ్రీహరి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బండ ప్రకాష్‌, పసునూరి దయాకర్‌, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ రాజయ్య యాదవ్‌, వీసీ సందీప్‌ సుల్తానీయా, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, కార్పొరేటర్‌ యాదగిరి, వర్ధన్నపేట జడ్పిటిసి సారంగపాణి, ఎంపిపి మార్నేని రవీందర్‌ రావు, తదితరులు పాల్గొన్నారు.