మాయమాటలతో మోసం చేస్తున్న కెసిఆర్
సమస్యలపై చిత్తశుద్ది లేని నేత : పొన్నాల విమర్శలు
జనగామ,నవంబర్27 (జనంసాక్షి) : కేసీఆర్ నిరంకుశ విధానాలు తెలంగాణ ప్రజలకు శాపంగా మారాయని పిసిసి మాజీఅధ్యక్షుడు, కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్యమండిపడ్డారు. ప్రాంతాలు, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చ గొడుతున్నారని విమర్శించారు. మాయమాటలతో కేసీఆర్ ఓట్లు దండుకుని ప్రజలను మోసం చేస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆర్టీసీ సమస్యనుపరిష్కరించలేని వ్యక్తి సిఎంగా ఎలా ఉంటారని అన్నారు. ఆర్టీసీని మూసేసి సొంత వ్యాపారం చేసే యోచనలో ఉన్నారని అన్నారు. ప్రజలకు సేవచేయని నాయకులను దూరం పెట్టాలన్నారు. కుటుంబ పాలనతో ప్రజలను ఇక్కట్లకు గురిచేస్తున్న కెసిఆర్, ప్రజల సమస్యలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. రీ డిజైన్ పేరుతో కోట్లు దోచుకున్న వారిని అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలు కనిపించడం లేదన్నారు. ఆంధ్ర కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చి కవిూషన్లు తీసుకున్నప్పుడు ఆంధ్రోళ్లు అని గుర్తుకు రాని కేసీఆర్‌కు తెలంగాణ ప్రజల బాగోగులు పట్టవన్నారు. కెసిఆర్ వాటం తీరు మాట్లాడుతారని అన్నారు. ప్రగతిభవన్ వీడి రాకుండా, సచివాలయం నుంచి కాకుండా ఇంటినుంచి పాలన చేస్తానని అనడం ఎంతవరకు సబబని అన్నారు. బంగారు తెలంగాణ ముసుగులో అక్రమాలతో రాష్టాన్న్రి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. మాట్లాడితే కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయని చెబుతున్న ముఖ్యమంత్రి.. నేటికి జిల్లాలో ఎగువమానేరుకు నీళ్లురాలేదు.. ఒక్క ఎకరం సాగులోకి వచ్చిందిలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం కోసం అనేక మంది అసువులుబాసిన వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. వారి త్యాగాల పునాదులపై తన కుటుంబానికి రాజకీయ భవిష్యత్తును నిర్మించారని తెలిపారు. తెలంగాణ ఉద్యమం సమయంలో యువత, విద్యార్థులపై దాడులు చేయించిన వారిని తెరాస అధికారంలోకి రాగానే వారిని పార్టీలోకి తీసుకుని మంత్రి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు.