మారనున్న నెల్లూరు రాజకీయాలు

టిడిపిని వీడేందుకు సిద్దమైన ఆనం

నెల్లూరు,జూన్‌14(జ‌నం సాక్షి): నెల్లూరు రాజకీయాలు రసవత్తరం కానున్నాయి. మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెదేపాను వీడాలని నిర్ణయించుకోవడంతో సవిూకరణాలు మారనున్నాయి. ఇక్కడ ఆనం బ్రదర్స్‌కు గట్టిపట్టు ఉంది. వచ్చే ఎన్నికల్లో ఇది ప్రభావం చూపగలదని అంటున్నారు. తాను టిడిపిలో కొనసాగలేనని ఆయన ఆత్మకూరు నియోజకవర్గంలోని నాయకులకు తేల్చి చెప్పేశారు. ఆనం రాజకీయ గమనంపై కొంతకాలంగా ఊహాగానాలు కొనసాగుతూ ఉన్న విషయం తెలిసిందే. ఆయన తెదేపాను వీడివైకాపాలో చేరతారనే ప్రచారం కొంతకాలంగా ఉంది. దానికితోడు జిల్లా మహానాడు, విజయవాడ మహానాడులకు ఆయన గైర్హాజరవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకొంది. ఈ క్రమంలో ఆయన ఆత్మకూరు నియోజకర్గంలోని మండలాల ముఖ్య నాయకులను బుధవారం పిలిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపాలో ఇంక ఇమడలేమని, వీడాలని నిర్ణయించుకొన్నట్లు వివరించారు. అందుకు దారి తీసిన కారణాలు వివరించారు. ఆత్మకూరు నియోజకవర్గం నుంచే వచ్చే ఎన్నికల బరిలో ఉంటానని ఈ విషయంలో అపోహ వద్దని నాయకులకు తేల్చి చెప్పారు. ఏ పార్టీలో ఎప్పుడు ఎలా చేరాలనే విషయం ఈ నెల 20వ తేదీన ఏర్పాటు చేసే ప్రత్యేక సమావేశంతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరితో మాట్లాడి నిర్ణయిస్తామని తెలిపారు. దాంతో మాజీమంత్రి ఆనం రాజకీయ గమనంపై నెలకొన్న ప్రచారాలు కొలిక్కి వచ్చే పరిస్థితి నెలకొంది. ఆనంకు జిల్లా స్థాయిలో అనుచరగణం, అభిమానులు, నాయకులు ఉన్నారు. దాంతో ఆయన నిర్ణయం అదే స్థాయిలో ప్రభావం చూపనుంది.