మారుతున్న ఎన్నికల ప్రచార సరళి

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తెలంగాణ రాష్ట్రసమితి అధినేత, సిఎం కెసిఆర్‌ ప్రచార ఉధృతిని పెంచారు. ఓ వైపు సోనియా ,రాహుల్‌ శుక్రవారం తొలి ప్రచార సభలో పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్‌ పెద్ద తలకాయలన్నీ ఇప్పుడు హైదరాబాద్‌లో మకాం వేశారు. ఇప్పటికే కెసిఆర్‌ దూకుడు పెంచారు. అభివృద్ది కార్యక్రమాలను వివరిస్తూనే సంక్షేమాన్ని ఎలా చేపట్టామో చెబుతున్నారు. మెల్లగా చంద్రబాబునే ప్రధానంగా టార్గెట్‌ చేసుకుని ఆయన తన ప్రచారాన్ని కొనసాగి స్తున్నారు. అలాగే జాతీయ రాజకీయాలపైనా మాట్లాడుతున్నారు. మోడీ తీరును కూడా దుయ్యబడు తున్నారు. ఒకేగాటున ఆయన అందరినీ విమర్విస్తూ చేస్తున్న ప్రచారంతో టిఆర్‌ఎస్‌లో ఊపు కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి నేటి వరకు పరిస్తితులును వివరిస్తూనే చేపట్టిన అభివృద్ది, సంక్షేమాలను చెబుతున్నారు. కాంగ్రెస్‌ నేతలు మళ్లీ బాబును భుజాలకెత్తుకుని వస్తున్నారని మండిపడుతున్నారు. సమైక్య నేత, తెలంగాణ ద్రోహి అంటూ బాబును నేరుగా కెసిఆర్‌ దుయ్యబడుతున్నారు. అలాంటి నేత మనకు అవసరమా అన్న ప్రచారాన్ని పెంచారు. తెలంగాణ ప్రగతిపథంలో దూసుకుపోతుంటే కూటమి పేరుతో చంద్రబాబును కాంగ్రెస్‌పార్టీ భుజాలవిూద మోసుకువచ్చిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ధ్వజమెత్తారు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి చేతగాక చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్నారని నిప్పులు చెరిగారు. ఆంధ్రావాడి కత్తితో పొడిచేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నిస్తున్నారని, తెలంగాణను అమరావతికి తొత్తుగా మార్చాలని చూస్తున్నారని విమర్శించారు. వలస బాబు పెత్తనం వద్దేవద్దని అన్నారు. చంద్రబాబు రూపంలో తెలంగాణకు ప్రమాదం పొంచి ఉందని, దీనిపై ప్రజలందరూ సీరియస్‌గా ఆలోచన చేయాలని సీఎం కేసీఆర్‌ తన ప్రచారంలో పదేపదే హెచ్చరిస్తున్నారు. వచ్చిన చంద్రబాబును, తీసుకువచ్చిన కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని పిలుపునిస్తున్నారు. తెచ్చినోన్ని దంచుతే మొత్తం సాపైతది. దంచుమంటే కొట్టమని చెప్తలేను.. ఓటుతోని దంచాలె. చైతన్యం చూపిచ్చి, బిడ్డా ఈ రాజకీయం చెల్లదని చెప్పాలంటూ కోరుతున్నారు. చంద్రబాబు పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రి. మిమ్మల్ని వదల బొమ్మాళీ.. వదల అంటున్నడు. వదిలి పెట్టడట. మరి ఎలా వదలగొట్టాలో విూరే నిర్ణయం చేయాలి. నేనైతే నావంతుగా ఒకసారి తరిమికొట్టాను. ఇప్పుడు తరిమికొట్టే బాధ్యత విూదే అని కేసీఆర్‌ చెబుతున్నారు. అడుగడుగునా తెలంగాణ ప్రయోజనాలకు అడ్డుపడే చంద్రబాబు ఇప్పుడు మన ఇంటికి వచ్చి మనల్ని కొట్టిపోయేందుకు చూస్తున్నాడని, విూ వేలితో మిమ్మల్ని పొడిచేయాలనే ఆలోచనతో టీడీపీ అభ్యర్థులను పోటీకి దించారని అన్నారు. మనకు నీళ్లు రానివ్వకుండా అడ్డుకున్నోడికి ఇప్పుడు మన ఓట్లు కావాలా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలని కేంద్రానికి చంద్రబాబు 30 లేఖలు రాసిన విషయాన్ని కేసీఆర్‌ గుర్తుచేశారు. అలాంటి చంద్రబాబు తెలంగాణకు అవసరమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, టీడీపీల వైఖరిని తూర్పారబట్టిన సీఎం.. తెలంగాణలో ఉడుముల్లా జొచ్చి దోచుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల తర్వాత కేంద్ర రాజకీయాల్లో జోక్యం చేసుకుంటానని కూడా అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్టాల్ర హక్కులను హరించి కర్రపెత్తనం చేస్తున్నదన్న సీఎం.. ప్రాంతీయపార్టీల పెత్తనం పెరుగాల్సి ఉందని చెప్పారు. కేంద్రంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వం రావాలన్నారు. అలాగే ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా కార్యక్రమాలను చేపట్టామని అన్నారు. కంటివెలుగు కార్యక్రమం విజయవంతం అయినట్టే రాబోయే ప్రభుత్వంలో చెవి, ముక్కు, గొంతు సమస్యలను నివారించేందుకు ఈఎన్టీ వైద్యులు ప్రతి ఇంటికీ వచ్చి ఉచిత వైద్యం అందిస్తారని చెప్పారు. తదుపరి రాష్ట్ర ప్రజలందరికీ రక్తపరీక్షలు నిర్వహించి.. తెలంగాణ

హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందిస్తామని సీఎం ప్రకటించారు. దేశం గర్వించదగ్గ పథకాలు అమలుచేస్తున్నామన్న సీఎం.. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాలను పురపాలికలుగా మార్చి కేంద్రం కర్ర పెత్తనం చేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ విమర్శించారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రధాని మోదీకి ఏమైందని.. ఈ విషయంలో ఆయన ఆలోచనలకు చెదలు పట్టాయా? అని మండిపడ్డారు. సరైన సమయంలో రిజర్వేషన్లు రాకపోవడంతో బడుగు, బలహీనవర్గాలు, గిరిజనులు, దళితులకు న్యాయం జరగడం లేదన్నారు. రాష్ట్రాల హక్కులను హరిస్తున్న విషయంలో కాంగ్రెస్‌, భాజపా దొందుదొందేనని ఆరోపించారు. ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానించిన బిల్లును మోదీ ప్రభుత్వం ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టిందని దుయ్యబట్టారు. రిజర్వేషన్లు ఆమోదించాలని 20 నుంచి 30 సార్లు స్వయంగా మోదీకి చెప్పానని.. 50 లేఖలు రాసినా స్పందన లేదని విమర్శించారు. కేంద్రం మెడలు వంచైనా గిరిజనులకు రావాల్సిన రిజర్వేషన్లు సాధిస్తామన్నారు. గడిచిన తమ పాలనాకాలంలో ఏమేం అభివృద్ధి పనులు చేశామో ప్రజలకు తెలియజెప్పారు. చేయనున్న ప్రణాళికను ఓటర్ల ముందుంచారు. కూటమి కుయుక్తులను ఎత్తిచూపారు. ఓట్ల కోసం వచ్చే చంద్రబాబును తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను పరిచయం చేస్తూ వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. సుడిగాలి పర్యటన చేస్తూ ప్రచారంలో జోరు పెంచారు. మొత్తంగా కెసిఆర్‌ ప్రచారంతో సరళి మారింది.