మార్కెట్లో దోపిడీని అరికట్టాలి
ఆదిలాబాద్,నవంబర్8(జనంసాక్షి): ఆదిలాబాద్ వ్యవసాయమార్కెట్యార్డులో రైతులను వ్యాపారులు నిలువుదోపిడీ చేస్తున్నా.. పాలకవర్గం పట్టనట్టు వ్యవహరిస్తోందని రైతు ఐకాస జిల్లా అధ్యక్షుడు దారట్ల కిష్టు విమర్శించారు.తేమ నిర్ధరణ విధానం అశాస్త్రీయంగా ఉందని తాము నిరూపించినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గతంలో 12 శాతం తేమతో పత్తి కొనుగోలు చేసిన వ్యాపారులు ఈసారి 8 శాతంతో కొనుగోళ్లు చేయడం.. తేమయంత్రాలు లోపభూయిష్టంగా ఉన్నా పట్టించుకోకపోవడం అనుమానాలకు
తావిస్తోందన్నారు. చీడపీడలు,నకిలీ విత్తనాలతో నష్టపోయిన పత్తి రైతులకు ఎకరానికి రూ.25వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులను మాటలతో మభ్యపెట్టకుండా వారిని ఆదుకునేదిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. గులాబీపురుగుతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని, కింగ్ పత్తికరం వేసి నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేలు సదరు కంపెనీ నుంచి ఇప్పించాలని డిమాండ్ చేశారు.