‘మార్చ్’కు ట్యాంక్ బండే వేదిక
మాది దండి యాత్ర.. దండయాత్ర కాదు
పాలకులే అసాంఘీక శక్తులను రెచ్చగొట్టే అవకాశం : కోదండరాం
జేఏసీలోకి కొత్త ఉద్యమ శక్తులు
తెలంగాణ ప్రజా , యునైటెడ్ ఫ్రంట్లు, తెలంగాణ లోక్‌సత్తా చేరిక
హైద్రాబాద్, సెప్టెంబర్ 19(జనంసాక్షి):
తెలంగాణ గతిని మార్చబోతున్న తెలంగాణ మార్చ్‌కు టాంక్బండే వేదిక అని కోదండరాం తేల్చిచెప్పారు. మాది దండయాత్ర కాదని..దండియాత్రే అని వెల్లడించారు. బుధవారం తెలంగాణ ప్రజా, యునైటెడ్ ఫ్రంట్, తెలంగాణ లోక్‌సత్తాలు జేఏసీలో చేరారు. దీనిపై కోదండరాం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనైనా మార్చ్ నిర్వహిస్తామని, మార్చ్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఉద్యమంలోకి కొత్త శక్తుల చేరికతో మరింత ఉత్సాహంగా ముందుకు దూసుకెళ్తామన్నారు. తెలంగాణ మార్చ్ సందర్భంగా అశాంతి చెలరేగుతుందని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని, కానీ పాలకులే అసాంఘీక శక్తులను రెచ్చగొట్టే అవకాశం ఉందన్నారు. తెలంగాణ మార్చ్‌కు అన్ని శక్తులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. జేఏసీలో కొత్త శక్తుల చేరికతో ఉధ్యమానికి మరింత ఊపు వస్తుందని, తెలంగాణ మార్చ్‌తో ఢిల్లీ దిమ్మతిరగాలని పేర్కొన్నారు. ఇంటికొకరు చొప్పున కదిలివచ్చి తెలంగాణ మార్చ్‌కు కదిలిరావాలని
పిలుపునిచ్చారు. తెలంగాణ సత్తా ఏంటో తెలంగాణ మార్చ్‌తో మరోసారి చాటాలని కోరారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని టాంక్‌బండ్‌పై తెలంగాణ మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. మార్చ్‌ను అడ్డుకోవాలని చూస్తే ఊరుకొనేది లేదని, ప్రభుత్వమే అసాంఘీక శక్తులను రెచ్చగొట్టి మార్చ్‌ను అభాసుపాలు చేయలని చూస్తోందని ఆరోపించారు. ఈ సమావేశంలో విమలక్క, జేఏసీ నేతలు తదితరులు పాల్గొన్నారు.