మార్పులు చేర్పులు తథ్యం : రాయపాటి
విజయవాడ, జూన్ 24 : ఇటీవలె ఉప ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్రంగా కలత చెందారని గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివారావు చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాక పార్టీలోను, ప్రభుత్వంలోను భారీ మార్పులు ఉంటాయని కూడా ఆయన పేర్కొన్నారు. కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు ఆదివారం నగరానికి విచ్చేసిన రాయపాటి కాసేపు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాగా లేదని ఆయన చెప్పారు. ప్రజలు పార్టీపైనా, ప్రభుత్వంమీద అసంతృప్తి ఉన్నారని అన్నారు. పార్టీని పటిష్ఠం చేయడంతో పాటు ప్రభుత్వంలో కూడా ప్రక్షాళన అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని నేరుగా సోనియాగాంధీకే వివరించానన్నారు. ఆమె కూడా అన్ని కోణాల నుండి ఆలోచిస్తున్నారని, రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఆశ్చర్యకర మార్పులు ఉంటాయని రాయపాటి ఉద్ఘాటించారు. కాగా కనకదుర్గమ్మ ఆలయంలో విమానగోపురానికి కేజి బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ఎంపి రాయపాటి తెలిపారు.