మావోయిస్టు అగ్రనేత గాజర్ల అశోక్‌ లొంగుబాటు

3

వరంగల్‌ ,డిసెంబర్‌29(జనంసాక్షి): మావోయిస్టు అగ్రనేత గాజర్ల అశోక్‌ మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 24 ఏళ్లుగా అజ్ఞాత జీవితం గడుపుతున్న మావోయిస్ట్‌ అగ్రనేత గాజర్ల అశోక్‌ అలియాస్‌ ఐతు అలియాస్‌ జనార్ధన్‌.. అనారోగ్య కారణాలతో వరంగల్‌ డిఐజి మల్లారెడ్డి ఎదుట మంగళవారం లొంగిపోయారు. దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న అశోక్‌ 1991 లో అప్పటి పీపుల్స్‌ వార్‌ పార్టీలో చేరారు. వరంగల్‌ జిల్లా చిట్యాల మండలం వెలిశాలకు చెందిన అశోక్‌…ఐటిఐ చదివిన తర్వాత ఆయన అన్న గాజర్ల సారయ్య అలియాస్‌ ఆజాద్‌ ప్రోద్భలంతో 18 ఏళ్ల వయసులోనే పోరుబాట పట్టాడు. 1991లో అశోక్‌ వరంగల్‌ పట్టణంలో ఆశన్న నేతృత్వంలో పనిచేశాడు. పాలకుర్తి, భూపాలపల్లి, స్టేషన్‌ ఘనపూర్‌ దళాల్లో సభ్యుడిగా పనిచేశాడు. పార్టీలో పనిచేస్తున్న క్రమంలో 1996లో 8 ఎంఎం రైఫిల్‌ ప్రమాదవశాత్తు పేలి కుడిచేతి మూడు వేళ్లు పోయాయి. 2000 సంవత్సరంలో డివిజన్‌ కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందిన అశోక్‌…వరంగల్‌ డివిజన్‌ సెక్రటరీగా పనిచేశారు. అదే ఏడాది దండకారణ్యానికి బదిలీ అయిన అశోక్‌..కిషన్‌ జీ భార్య ఐనా సుజాతక్క నేతృత్వంలో 2006 వరకు పనిచేశారు. 2008 నుంచి ఇప్పటిదాకా దక్షిణ బస్తర్‌ డివిజన్‌ కమిటీ సెక్రెటరీగా కొనసాగుతున్నారు. జనతన సర్కార్‌ తో ఎంతోమంది ఆదివాసీలను పార్టీలో చేర్చడంలో అశోక్‌ క్రియాశీలకంగా పనిచేశారన్నారు డిఐజి మల్లారెడ్డి. ఈయన మరో సోదరుడు గాజర్ల రవి.. ప్రస్తుతం అజ్ఞాతంలో ఆంధ్రా, ఒరిస్సా బార్డర్‌ లో పని చేస్తున్నట్లు చెప్పారు. మావోయిస్ట్‌ అగ్రనేతలు జివికే ప్రసాద్‌ అలియాస్‌ ఊసెండి, కుక్కల రవి అలియాస్‌ అర్జున్‌ ల లొంగుబాటు స్ఫూర్తితో లొంగిపోతున్నట్లు చెప్పారు అశోక్‌.