మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతి..
హైదరాబాద్ ఆగస్టు 18 (జనం సాక్షి):
మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి (70) అలియాస్ సాయన్న కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తాజాగా తుదిశ్వాస విడిచారు. రాజారెడ్డి మృతిపై ఇప్పటివరకు మావోయిస్టు పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ మల్లా రాజారెడ్డి మరణ వార్త వైరల్ కావడంతో దీనిపై కేంద్ర నిఘా వర్గాలు దృష్టిసారించాయి. ఈ క్రమంలోనే రాజారెడ్డి మృతిని ఛత్తీస్‌గఢ్ పోలీసులు ధృవీకరించారు.
మల్లా రాజిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్‌పూర్ పరిధిలోని శాస్త్రులపల్లి. తొలితరం మావోయిస్టు నేతల్లో ఆయన ఒకరు. మావోయిస్టు పార్టీలో చిన్నస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం ఆయన కేంద్ర కమిటీ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మావోల కార్యకలాపాల విస్తరణలో మల్లా రాజరెడ్డి కీలక పాత్ర పోషించారు. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌లతో కూడిన మావోయిస్టుల నైరుతి ప్రాంతీయ బ్యూరోలో విప్లవాత్మక ఉద్యమానికి ఇన్‌ఛార్జిగా కూడా పనిచేశారు. సంగ్రామ్, సాయన్న, మీసాల సాయన్న, అలోక్, అలియాస్ దేశ్‌పాండే, సత్తెన్న వంటి పేర్లతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనపై కోటి రూపాయల నజరానా కూడా ఉంది.