మా గొంతులెండినా ..
మా గుండెలు మండినా మీకు పట్టదు !
మాకు కన్నీళ్లు.. కృష్ణా డెల్టాకు సాగునీళ్లా
హరీష్‌రావు ఫైర్
హైదరాబాద్, జూన్ 29 (జనంసాక్షి): కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలన్న ముఖ్యమంత్రి కిరణ్ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండించింది. నారుమళ్లపై కృష్ణా డెల్టాకు నీటిని వదిలితే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు మంచినీటి సమస్య తలెత్తుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారంనాడు ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల నోటిని ఎండగట్టి కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి ఆలోచనను ఖండించారు. సాగర్‌లో
నీటిమట్టం అడుగంటిందని, ఒక్క అడుగు నీటి మట్టం తగ్గితే కృష్ణా జలాల మంచినీటి ఎద్దడి తీవ్రం కానున్నదన్నారు. దీనిపై హైదరాబాద్‌కు చెందిన మంత్రులు ముఖేష్‌గౌడ్, దానం నాగేందర్ ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు దేవుడే దిక్కు అన్నట్టు వ్యాఖ్యలు చేసిన మంత్రి సుదర్శన్‌రెడ్డి ఒక్క క్షణం కూడా మంత్రి పదవిలో ఉండ డానికి అనర్హుడని, వెంటనే పదవికి రాజీనామా చేయాలని హరీష్ డిమాండు చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయి ఉండి కూడా సీమాంధ్ర నేతల మోచేతి నీటిని తాగే విధంగా సుదర్శన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని హరీష్ విమర్శించారు. నాగార్జునసాగర్ కుడి కాలువకు నీరు వదిలి, ఎడమ కాల్వకు వదలకపోవడం దారుణమన్నారు. సిఎం తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణ మంత్రులు నోరు విప్పాలని హరీష్ డిమాండు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే రాయల తెలంగాణ ప్రతిపాదనను కేంద్రం తీసుకువస్తోందని ఆయన విమర్శించారు. రాయల తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించబోమని ఆయన అన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణనే తమకు కావాలని ఆయన డిమాండు చేశారు. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించు కోకపోతే నీటి విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ జిల్లాల్లోని రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత తీవ్రంగా ఎదురవుతోందని, వాటిని పరిష్కరించలేకపోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నా రు. రైతులకు అందాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ అందడం లేదని ఆరోపించారు.