మా బిడ్డ మరణం మహిళకు రక్షణ కవచం కావాలి మృతురాలి తల్లిదండ్రుల ఆకాంక్ష
సింగపూర్, డిసెంబర్ 29): ‘మా బిడ్డ మరణం మన దేశంలోని మహిళకు రక్షణ కవచంగా మారాలి’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు. ఆ యువతి తల్లిదండ్రులు. ఢిల్లీలో గ్యాంగ్ రేప్‌కు గురైన 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థిని తల్లిదండ్రులు కూడా స్థిరమైన మానసిక ధైర్యంతో ఎదురొడ్డి నిలబడ్డారు. కన్నకూతురు మృత్యు కౌగిలిలో ఒరిగిపోతే కన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతారు. కాని ఈ సమయంలోనూ వారు పడతుల శ్రేయస్సును కాంక్షించారు. ఇది భవిష్యత్తులో రూపుదాల్చనున్న ఆందోళనకు ఆయువును అందిస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు. ఆనందంగా ఇంటికి చేరాలని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఆ కనురెప్పలకు తమ కను’పాప’ను కామంతో కొన్ని మానవ మృగాలు చిదిమేశాయని తెలిసి ఆ తల్లిదండ్రులు కన్నీరు కార్చడమే తప్ప ధ్వేషంతో, ఆవేశంతో రగిలిపోయి విద్వేషాగ్నిని రగిల్చిన సందర్భం ఈ 13 రోజుల్లో ఎక్కడ కానరాలేదు. కళ్లముందు కన్న కూతరు మృత్యువుతో పోరాడుతున్న సమయంలో తనను పలకరించడానికి వచ్చిన ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను పన్నెత్తు మాట అనలేదు. వారి మానసిక స్థిరత్వాన్ని చూసి షీలాదీక్షిత్ సైతం ఆశ్చర్యంపొందారు. చివరకు కన్న కూతురు కన్నుమూసిన ఘటనను కూడా తమ స్వ ప్రయోజనాలకో, రాజకీయ లబ్ధికోసమో వినియోగించుకోలేదు. తమ కుమార్తె మృతి ఈ దేశంలో నిర్భయంగా తిరిగేలా మహిళకు రక్షణ కల్పించాలని కోరుకున్నారంటూ వారి ముందు మహిళా లోకం తలవంచాల్సిందే. సింగపూర్ నుంచి భారత హై కమిషనర్ రాఘవన్ శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ గ్యాంగ్ రేప్ బాధితురాలు మృతి తల్లిదండ్రులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపడమే కాకుండా వారిని ఆవేదనకు గురిచేసిందని, ఇదే సందర్భంలో వారు తనతో మాట్లాడుతూ తమ కుమార్తె మరణం భవిష్యత్తులో ఇండియాలోనూ, ఢిల్లీలోనూ ప్రతి మహిళకు రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నట్లు హై కమిషనర్ వెల్లడించారు.