మా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు :మంత్రి హరీశ్ రావు
కరీంనగర్: నిత్యావసరాల ధరలు పెంచిన బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ధరల పెరుగుదలతో బాధలు పడ్డా ఫరవాలేదు.. నాకు మాత్రం ఓటేయండని ఈటల రాజేందర్ చెప్తున్నాడని విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని మాచాన్‌పల్లిలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ధూంధాం కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న రైతులపై కార్లు ఎక్కించి చంపిన చరిత్ర బీజేపీదన్నారు. వ్యవసాయ మోటార్లకు బీజేపీ ప్రభుత్వం మీటర్లు పెడతామంటే వద్దని చెప్పి.. మా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తామని సీఎం కేసీఆర్ తెగేసి చెప్పారని మంత్రి అన్నారు. రైతు చట్టాలను వ్యతిరేకించిన ఈటల ఇప్పుడు మాట మార్చిండని విమర్శించారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం రైతులు, సామాన్యులను పీడిస్తున్నదని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక అయిపోగానే సిలిండర్ ధర మరో రూ.200 పెంచుతుందని ఆరోపించారు. రైతుబంధు, రైతుబీమాతో రైతులను ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఆపొద్దని సీఎం కేసీఆర్ మా జీతాలు కోత పెట్టారని చెప్పారు. ఈటల రాజేందర్ ఏడేండ్లు మంత్రిగా చేసి ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు.
బీజేపీకి ఓటేస్తే సిలిండర్ ధర రూ.1500 అవుతుందన్నారు. సీఎం కేసీఆర్ లేకపోతే అసలు ఈటల రాజేందర్ అనేటోడు ఉన్నడా అని ప్రశ్నించారు. బీజేపీని బొంద పెడితేనే సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయన్నారు. ఓట్ల కోసం ఈటల పచ్చి మోసపు మాటలు, అబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజామాబాద్‌లో ఒక్క రూపాయి పని చేయని ఎంపీ అరవింద్.. హుజూరాబాద్‌లో పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు.