మిలిటరీ తిరుగుబాటుదారుల ఘాతుకం


మయన్మార్‌లో వేయిమంది కాల్చివేత
న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): ఈ ఏడాది ఫిబ్రవరిలో సైన్యం మయన్మార్‌ ప్రభుత్వాన్ని కూలదోసినప్పటి నుండి ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా పౌరులు మరణించారని అసిస్టెన్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ పొలిటికల్‌ ప్రిజనర్స్‌ (ఎఎపిపి) తెలిపింది. 999మంది పౌరులను మిలిటరీ హత్య చేసిందని ఎఎపిపి ట్విట్టర్‌లో పేర్కొనగా, బుధవారం ఉదయానికి ఈ సంఖ్య 1001కి చేరిందని విూడియాకు తెలిపింది. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే వుంటుందని గ్రూపు కార్యదర్శి టాటే నైయింగ్‌ తెలిపారు. 7,320మంది అరెస్టు కాగా, ప్రస్తుతం 5,712మంది నిర్బంధంలో వుండడమో లేదా మరణశిక్ష పడడమో జరిగిందని వార్తలు తెలిపాయి. అరెస్టు వారంటును తప్పించుకున్నవారు 1984మంది వున్నారని తెలిపింది. కనీ టౌన్‌షిప్‌లో జులైలో జుంటా ఊచకోత కోసిన వారి వివరాలపై బుధవారం ఈ గ్రూపు ఒక ప్రకటన జారీ చేసింది. 43మంది పౌరులు మరణించారంటూ మృతదేహాల ఫోటోలను విడుదల చేసింది. ఈ ప్రకటనను, ఫోటోలను
తదనంతరం మానవ హక్కుల నెట్‌వర్క్‌ షేర్‌ చేసింది. అంతర్జాతీయ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘిస్తున్నట్లు, తీవ్రమైన నేరాలకు జుంటా పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోందని పేర్కొంది. మిలటరీ పాలను వ్యతిరేకిస్తూ వేలాదిమంది నిరసనలు కొనసాగిస్తూనే వున్నారు.