మిషన్‌ భగీరథకు అధికా ప్రాధాన్యం

గడువులోగా పూర్తయ్యేలా చర్చలు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): సిఎం కెసిఆర్‌ లక్ష్యం మేరకు మిషన్‌ భగీరథ పనులను పూర్తి చేసేందుకు అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఎప్పటికప్పుడు సిఎం కార్యాలయాలనికి నివేదిక అందచేస్తున్నారు. దీనికి సంబంధించి నిర్ధేశించిన గడువు మేరకు పనులు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి కావాలన్న రీతిలో ముందుకు సాగుతున్నారు. ఏదైనా సమస్య ఉంటే స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించుకోవాలని సిఎం కెసిఆర్‌ ఇప్పటికే సూచించారు. చిన్న సమస్యలతో నిలిచి పోయిన పైప్‌లైన్‌ పనులను త్వరిత గతిన పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో మంచినీటి పథకాలు పురోగతిలో వేగం పెంచాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం పనులను డిసెంబర్‌ 31కల్లా పూర్తి చేసి ఇంటింటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగురామన్న కూడా అన్నారు. మిషన్‌ భగీరథ పథకానికి సంబంధించిన పైప్‌లైన్‌ విషయంలో అలసత్వం వహించకుండా ప్రతి గ్రామానికి పైప్‌లైన్‌ వేయాలని ఆదేశించారు. ఎక్కడైన సమస్య తలెత్తితే తన దృష్టికి తీసుకరావాలని సూచించారు. ప్రస్తుతం మండలాల వారిగా స్థానిక ప్రజాప్రతినిధులు పైప్‌లైన్‌ పనులను పర్యవేక్షిస్తున్నారని ఎక్కడైనా అలసత్వం వహించినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రస్తుతం మంజూరైన మంచినీటి ట్యాంకుల నిర్మాణ పనులపై ఆరా తీశారు. మొత్తం నీటి ట్యాంకుల నిర్మాణ పనులను చేపట్టేందుకు అగ్రిమెంట్‌ వెంటనే చేసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలోని గిరిజన గ్రామాలకు పైప్‌లైన్‌తో పాటు తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న గ్రామాల పరిస్థితి మెరుగు పర్చే విధంగా అధికారులు పని చేయాల్సి ఉంటుందన్నారు. గ్రామాల్లో ప్రభుత్వం నిర్ధేశించిన గడువు లోపే పనులను పూర్తి చేయాలని మిషన్‌ భగీరథ ఇంజనీర్లకు ఆదేశించారు. సిఎం కార్యాలయం అడిగిన వెంటనే సమాచారం అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.