మిషన్ హాస్పిటల్ ఆస్తులను కాపాడాలి
వరంగల్ బ్యూరో, అక్టోబర్ 28 (జనం సాక్షి)
హనుమకొండ లోని మిషన్ హాస్పిటల్ ఆస్తులను కాపాడాలని, హాస్పిటల్ భూమిని ఆక్రమించిన భూకబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అడిషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రాపర్టీ అసోసియేషన్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చిస్ మంద సురేందర్ బాబు అన్నారు. ఈ మేరకు ఉరుసు సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేందర్ బాబు మాట్లాడుతూ హన్మకొండ సర్వేనెంబర్ 1147- 1150 లో గల మిషన్ హాస్పిటల్ కాంపౌండ్ ఆక్రమించి ఇబ్బందులకు గురి చేస్తున్న ఏడుగురిపై ప్రభుత్వం అధికారులు చర్య తీసుకోవాలని కోరారు. గతంలో వీరిపై చర్యలు తీసుకోవాలని వివిధ పోలీస్ స్టేషన్ లతోపాటు సిపి కలెక్టర్ ఇతర అధికారులకు కూడా విన్నవించామని అయినా ఎలాంటి ఫలితం లేదన్నారు. మిషన్ హాస్పిటల్ కు సంబంధించిన వందల కోట్ల ఆస్తులను కబ్జా చేస్తుంటే చూస్తూ ఉన్నారే గాని ఎలాంటి సహాయం చేయలేదన్నారు. ఈ భూమిపై మద్రాస్ కోర్టు 2000 సంవత్సరంలో మిషన్ ప్రాపర్టీస్ అమ్మకూడదు, కొనకూడదు అని ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినట్లు సురేందర్ బాబు వివరించారు. ఈ విషయంలో భూ కబ్జాదారులు కోర్టుకు హాజరై ఎలాంటి లావాదేవీలు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని చేయకూడదని కోర్టు తెలిపింది. ఈ విషయంలో 2004లో కంటెంట్ పిటిషన్ డివిజన్ బెంచ్ వారి వద్ద నిందితులు హాజరై భూమితో తమకు సంబంధం లేదని ఎలాంటి ఆటంకం కలిగించమని అండర్ టేకింగ్ ఇచ్చినట్లు సురేందర్ బాబు చెప్పారు. అయినా కూడా 2005లో ముగ్గురు వ్యక్తులు ఓరుగల్లు కన్స్ట్రక్షన్ ఫరం రిజిస్ట్రేషన్ చేశారు అని సురేంద్రబాబు తెలిపారు. కొందరు దౌర్జన్యంగా మిషన్ హాస్పిటల్ కాంపౌండ్ వాల్ కూలగొట్టి నిర్మాణం చేస్తుండగా తాము అడ్డుకున్నామని అయినా కూడా పోలీసు అండతో గుండాల సహకారంతో దనబలంతో రాజకీయ అండతో హైకోర్టు ఆర్డర్ బేఖాదర్చేసి నిర్మాణాలు చేపట్టారని సురేందర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ హాస్పిటల్ సమస్యపై మంత్రి దయాకర్ రావు ఎమ్మెల్యే వినయ్భాస్కర్ తో పాటు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పోలీస్ కమిషనర్ కు కూడా వివరించామని తమకు ఎలాంటి సహాయం అందలేదని తెలిపారు. పది రోజుల్లో లక్షలాది మంది పేద క్రైస్తవులకు సంబంధించిన మిషన్ హాస్పిటల్ ఆస్తులపై న్యాయమైన చర్యలు తీసుకోకపోతే 18% ఉన్న తమ దళిత క్రైస్తవులంతా ఈ ఎన్నికలలో సరైన నిర్ణయం తీసుకొని తమ సత్తాను, ఆత్మ అభిమానాన్ని చాటుకుంటామని సురేందర్ బాబు హెచ్చరించారు. ఈ సమావేశంలో క్రైస్తవ పెద్దలు జేజే థామస్, బిషప్ జన్ను ఈర్మియా, బ్రదర్ సుమన్, పాస్టర్ రుద్రరాజు జయప్రకాష్, డీకే రవి, కలకోట్ల రాజు, పోగుల ప్రసంగి, సుమన్, బ్రదర్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.