మీడియాకు సామాజిక బాధ్యత లేదా?
ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దానిపై దుమారం రేగడం, వివాదంపై ఆందోళనలు ప్రారంభం కాకముందే ఆయన విదేశాలకు వెళ్లడం, లండన్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవడం ఇలా వివిధ ఘట్టాలను వివిధ స్థాయిల్లో చూపిన మీడియా చాలా సందర్భాల్లో స్వీయ విచక్షణను కోల్పోయింది. హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన అరెస్టుపై పుంఖానుపుంఖాలుగా వార్తలు ప్రచురించింది, ప్రసారం చేసింది. ఆది, సోమ, మంగళవారాల్లో మీడియా వ్యవహరించిన తీరును చూస్తే అందరికీ ఆశ్చర్యం కలుగుతోంది. ‘ప్రజాహితమే పత్రికారచన లక్ష్యం కావాలని’ మహాత్మాగాంధీ అన్నారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, వార్తలు ప్రసారం చేయొద్దని, ప్రచురించవద్దని ప్రతి మీడియా హౌస్, జర్నలిజం కళాశాలల ప్రారంభ తరగతుల్లోనే బోధిస్తారు. ఇటీవల మీడియా చానెళ్లు కుప్పలు తెప్పలుగా పుట్టుకు వస్తుండటంతో మీడియాలో పోటీ కూడా పెరిగిపోయింది. ఎంతసేపు ఎవరు ముందు బ్రేకింగ్ పెట్టారు.. ఎవరు ఫస్ట్ విజువల్స్ ప్రసారం చేశారు అనే ఆధిపత్య ధోరణే తప్ప ఈక్రమంలో పాత్రికేయ విలువలు పాటిస్తున్నామా? అని ఎవరూ పట్టించుకోలేదు. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై మరో వర్గానికి చెందిన రాజకీయ పార్టీ పెద్ద ఎత్తున నిరసలు తెలుపుతూ దీనిని రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు మీడియా అక్బర్ అరెస్టు ఇప్పుడా.. రేపా.. అంటూ సొంత వ్యాఖ్యానాలు చేసుకుంటూ పోతుంది. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీకి చెందిన ఎంఐఎం పార్టీ సమస్త ముస్లింల ప్రతినిధిగా మారాలనే క్రమంలో ఆ వర్గం వారిలో అనవసర భయాందోళనలు చొప్పించి తామే రక్షించే శక్తిగా చెప్పుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈక్రమంలోనే అక్బర్ నిర్మల్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాటిని కూడా మీడియా యథాతదంగా ప్రసారం చేసింది. సమస్త భారతీయులు అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఖండించారు. అతివాద పార్టీకి చెందిన అక్బరుద్దీన్‌ది మొదటి నుంచి దుందుడుకు స్వభావమే. తస్లిమా నస్రీన్ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఆయన, ఆయన పార్టీ నేతలు వ్యవహరించిన తీరు మనందిరికీ తెలుసు. ఇంత వరకు పాతబస్తీకే పరిమితమైన తమ పార్టీని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో విస్తరింపజేయాలనే తలంపుతో ఆయన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలో రెచ్చిపోయి మాట్లాడారు. పర్యావసనాలు, తరువాతి పరిణామాలు తెలియకుండానే ఆయన మాట్లాడారనుకోవడం అవివేకమే. అయినా మీడియా ఆయన వ్యాఖ్యల తర్వాతి పరిణాలపై ఇష్టం వచ్చినట్లుగా వార్తలు అల్లుకుపోయింది. ప్రపంచంలో మరో సమస్యే లేనట్టుగా మీడియా చానెళ్ల డీఎస్ఎన్జీ వ్యాన్లు అక్బరుద్దీన్ నివాసం వద్ద, గాంధీ ఆస్పత్రి వద్ద, పాత బస్తీలో, నిర్మల్‌లో, నిజామాబాద్‌లో, అక్బర్‌ను నిర్మల్‌కు తరలించే మార్గాల్లో పెట్టి ఎప్పటికప్పుడు లైవ్ కథనాలు వండి వడ్డించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా చానెళ్ల రిపోర్టర్లకు వేరే పనిలేనట్టు అక్బర్ వ్యాఖ్యలపై, తదనంతర పరిణామాలపై మరో అడుగు ముందుకేసి పోలీసుల తీరుపై అభిప్రాయాలు సేకరించింది. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. ఆ మధ్య కరీంనగర్ చిన్న పాటి ఘర్షణ చోటు చేసుకుంది. ఓ ప్రముఖ చానెల్ కరీంనగర్లో కత్తిపోట్లు అంటూ బ్రేకింగ్ ఇచ్చింది. తర్వాత చోటు చేసుకునే పరిణాల గురించి క్షణకాలం కూడా ఆలోచించకుండా వార్తలను జనం ముందుకు వదిలింది. ఇలాంటి పరిణామాలను చూసే మీడియాకు లక్ష్మణ రేఖ ఉండాలంటూ వివిధ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఎవరో నిర్దేశించే లక్ష్మణరేఖకు లోబడి పనిచేయడం మీడియా పత్రికా స్వేచ్ఛకు విఘాతమంటూ గగ్గోలు పెట్టేవారు తాము ప్రసారం చేస్తున్న కథనాలు, వార్తలపై ఒకసారి సమీక్షించుకుంటే ఇలాంటి పరిస్థితి రాదు. లోకమంతటికి నీతులు వళ్లించే మీడియా తాను స్వయంగా నీతిని పాటించకపోవడం దేనికి సంకేతం. మీడియా అన్నింటికీ అతీతం అనే భావనలో ఉందా. సున్నితమైన అంశాలపై కథనాలు ప్రసారం చేసేముందు తర్వాత ఉత్పన్నమయ్యే పరిణామాలు ఆలోచించాలి. స్వయం నియంత్రణ పాటించాలి. ప్రజల్లో శాంతిసామరస్యాలు, సుహృద్భావపూరిత వాతావరణం నెలకొనేలా మీడియా సంస్థలు పాటు పడాలి. ఇది తమ సామాజిక బాధ్యత అని గుర్తించాలి. దీనిని విస్మరిస్తే.. ఎవరేమైపోతే నాకేంటి అనే పెడ ధోరణి ప్రదర్శిస్తే.. తర్వాత జరగబోయే అన్ని పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది అన్ని మీడియా సంస్థలు గుర్తిస్తే అందరికీ మంచిది.