ముంచుకొస్తున్న పదో తరగతి పరీక్షల సమయం
మార్చి 16 నుంచి పరీక్షలకు ఏర్పాట్లు
విద్యార్థులను సన్నద్దం చేస్తున్న టీచర్లు
హైదరాబాద్,ఫిబ్రవరి15(జనంసాక్షి): పదోతరగతి మార్చి 16వ తేదీ నుంచి పరీక్షలు జరగనున్నాయి. గడువు సవిూపిస్తుండటంతో విద్యార్థుల్లో ఒకింత ఆందోళన మొదలైంది. దీనికితోడు ఎగ్జామ్ ఫీవర్ పట్టుకుంది.దీంతో అటు ఉపాధ్యాయలుకు కూడా విద్యార్థులను మంచి ఫలితాలు రాబట్టేలా సన్నద్దం చేస్తున్నారు. ప్రత్యేక తరగతులునిర్వహించి వారి అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో ఓ వైపు అధికారులు అటువైపు కూడా దృష్టి పెట్టాల్సి వస్తోంది. ఉన్నత చదువుల్లో రాణించేందుకు ఇదే తొలిమెట్టు
కావడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల దృష్టి పదో తరగతి పరీక్షలపై ఉంటుంది. ఇప్పటికే సమ్మెటివ్, ఫార్మెటివ్ పరీక్షలు చేశారు. సిలబస్‌లు పూర్తిచేసి రివిజన్‌లు నిర్వహిస్తూ ప్రీ ఫైనల్ పరీక్షలు సైతం విద్యార్థులు రాయనున్నారు. వార్షిక పరీక్షల తరహాలో నిర్వహించే పరీక్షలు రాయడం ద్వారా విద్యార్థులకు భయం తొలగి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సరిగ్గా నెలరోజుల్లో పది పరీక్షలు మొదలు కానున్నాయి. పాఠశాల విద్యార్థుల్లో బట్టీ విధానానికి స్వస్తి పలికి వారిలోని సృజనాత్మకత ను వెలికి తీసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర నిరంతర మూల్యాంకన విధానమే ఈపరీక్షల్లో కీలకం. గత రెండు సంవత్సరాల నుంచి ఈవిధానంలో పరీక్షలు జరుగుతున్నాయి. ఈవిధానంలో మెదడుకు పదును పెట్టాల్సి రావడంతో చాలా మంది విద్యార్థులు గణితంలో, భౌతికశాస్త్రాల్లో ఫెయిలవుతున్న దాఖలాలున్నాయి. ఈదపా ఫెయిలు కాకుండా ఉండేందుకు ఈవిధానంపై పూర్తి అవగాహన కల్పించారు. పదో తరగతి విద్యార్థినులకు సులభమైన పద్ధతిలో బోధించాలని ఇప్పటికే జిల్లా అధికారులు ఉపాధ్యాయులను ఆదేశించారు. ఇప్పటి వరకు ఎంత సిలబస్ పూర్తి చేశారని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుంటున్నారు. వెనుకబడిన సిలబస్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలని సూచించారు. పదేళ్లుగా చదువుకున్న పాఠశాలలోనే పరీక్షలు రాసి మొదటి సారి ఇతర పాఠశాలల్లో పరీక్షలు రాయడమంటే కొంత భయం ఉంటుంది. ముందుగా ఆభయాన్ని దూరం చేయాలి. కఠినమైన పాఠ్యాంశాలను ఒకటికి పదిసార్లు అర్ధం చేసుకుంటూ చదవాలి. ప్రశ్నలకు జవాబులు అని కాకుండా ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకుంటూ చదవాలి. తోటి విద్యార్థులతో కలిసి బృందంగా చర్చించాలి. ఈ విధానంలో విశ్లేషణ ఉంటుంది. కాబట్టి అంశం ఎక్కువగా కాలం గుర్తుంటుంది. పాఠ్య పుస్తకాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. చదివే సమయంలో ప్రతిపదం, వాక్యం కీలకమూ అన్న భావన దృష్టిలో ఉంచుకోవాలి. ఒక అంశాన్ని లేక పేరాను చదివిన తర్వాత దాని నుంచి సొంతంగా ప్రశ్నలు వేసుకోవాలి. పరీక్షకు సంబంధించి ఒక్కో సబ్జెక్ట్‌లోని రెండు ప్రశ్నాపత్రాల్లో కలిపి 80 మార్కులకు తప్పనిసరిగా 28 మార్కులు రావాలి. మూల్యాంకనంతో కలుపుకుని 35 మార్కులు పాసైనట్టుగా పరిగణిస్తారు. ఒక వేళ ఇంటర్నల్ మార్కులలో సున్నా వచ్చిన పరీక్షల్లో 35 మార్కులు వస్తే ఉత్తీర్ణులైనట్టే. సెకండ్ లాంగ్వేజ్‌లో పరీక్షలో 16 మార్కులు తప్పనిసరి. మూల్యాంకనంలో కలిపి 20 మార్కులు వస్తే ఉత్తీర్ణులవుతారు. మూల్యాంకనంలో సున్నా మార్కులు వచ్చినా పరీక్షలో 20 మార్కులు వస్తే సరిపోతుంది.