ముందు తెలంగాణపై తేల్చాకే
విజయమ్మ మా గడ్డపై అడుగుపెట్టాలి
వైఎస్సార్‌సీపీ సిరిసిల్ల పర్యటన ఓ రాజకీయ డ్రామా
సీమాంధ్ర నాయకత్వాన్ని ప్రజలు సహించరు : కేటీఆర్
హైదరాబాద్, జూలై 14 (జనంసాక్షి) : రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న విషయంపై ఆదివారం నిర్ణయిస్తామని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు. పొలిట్‌బ్యూరో సమావేశం ఆదివారం జరగనున్నదని, ఆ సమావేశంలో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే ఏ అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలన్న దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని వివరించారు. తెలంగాణ భవన్‌లో శనివారంనాడు విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రపతి అభ్యర్ధి ప్రణబ్‌కు మద్దతు ఇచ్చిన వైఎస్‌ఆర్‌సిపి వైఖరిపై అనుమానాలున్నా యన్నారు. జగన్‌కు బెయిల్ కోసమే ఆ పార్టీ ప్రణబ్‌కు మద్దతు తెలిపిందన్నారు. వైఎస్‌ఆర్ సిపి, కాంగ్రెస్ మధ్య కుదిరిన రహస్య అజెండా ఏమిటో వెల్లడించాలన్నారు. సిరిసిల్లలో దీక్ష చేపట్టిన విజయమ్మ తొలుత తెలంగాణపై స్పష్టత ఇవ్వాలన్నారు. తెలంగాణపై ఆ పార్టీ వైఖరిని స్పష్టంగా వెల్లడించాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలన్నారు. చేనేత కార్మికులకు, జౌళి కార్మికులకు మధ్య ఉన్న వ్యత్యాసం విజయమ్మకు తెలుసునా అని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ హయాంలోనే చేనేత కార్మికుల ఆత్మహత్యలు అధిక సంఖ్యలో చోటు చేసుకున్నాయన్నారు. వైఎస్‌ఆర్ తీసుకున్న నిర్ణయాల వల్లే చేనేతరంగం కుంటు పడిందన్నారు. చేనేత కార్మికుల పట్ల వైఎస్‌ఆర్ సైంధవుడిగా నిలిచారన్నారు. సైంధవుడి ఫొటోతోను, సైంధవుడి కొడుకును మరో పక్క పెట్టుకుని విజయమ్మ దీక్ష చేస్తే ప్రజలు నమ్మబోరన్నారు. సిరిసిల్లను రాజకీయ పర్యాటక కేంద్రంగా చేసేందుకు విజయమ్మ సిరిసిల్ల పర్యటన అని చెప్పారు. విజయమ్మకు చేనేత కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే జగన్ దోచుకున్న లక్షల కోట్ల రూపాయలలో నుంచి వెయ్యి కోట్లను తీసి వారి పేరిట నిధి ఏర్పాటు చేయాలన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే విజయమ్మ దీక్ష చేపడుతున్నారన్నారు. రైతు సమస్యలపై ఢిల్లీకి వెళ్లి గర్జించిన విజయమ్మ.. తెలంగాణ విషయంపై ఢిల్లీకి ఎందుకు వెళ్లరో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రిగా తన ఉనికిని చాటుకునేందుకే సిఎం కిరణ్ ఇందిరమ్మ బాట చేపట్టారన్నారు. ఉద్యోగులను కాల్చివేయండి అన్న మంత్రి టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యమేనని అన్నారు. నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రాంతంలోని ప్రజలకు తాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. జెఎసిలో టిఆర్‌ఎస్ అంతర్భాగమని వ్యాఖ్యానించారు. తమలో ఎటువంటి విభేదాల్లేవన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం సమష్టిగా పోరాడుతున్నా మని చెప్పారు. కెసిఆర్ బిక్షాటన చేయగా వచ్చిన సొమ్మును చేనేత కార్మికులకు టిఆర్‌ఎస్ తరఫున అందజేశామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటిని నాగార్జునసాగర్‌లోనే నిల్వ చేయాలని కోరారు. తాగునీరు ఇవ్వకుండా నారుమళ్లకు నీరివ్వడం సరైన పద్ధతి కాదని చెప్పారు.