ముంబయిని ముంచెత్తిన వరుణుడు

– మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం
– జలమయమైన రహదారులు
– రద్దయిన పలు రైళ్ల రాకపోకలు
– మరో రెండు రోజుల పాటు వర్షసూచన
– ఆందోళన చెందుతున్న లోతట్టు ప్రాంతాల వాసులు
– రంగంలోకి నావికాదళం
ముంబయి,జులై11(జ‌నం సాక్షి) : ముంబయిని వరుణుడు వీడటం లేదు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబయిలోని పలు రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరింది. ఇదిలా ఉంటే ఇప్పటికే భారీ వర్షాలకు అతలాకుతలమైపోతున్న ముంబయి నగరానికి ఇంకా వర్షసూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముంబయి, పరిసర ప్రాంతాల్లో గురువారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దీంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నడుము లోతు నీటితో నిండిపోయిన మహానగరం పరిస్థితి ఇంకెంత దారుణంగా తయారవుతుందోనని భయపడుతున్నారు. గత మూడు రోజులుగా నగరాన్ని వానలు ముంచెత్తుతున్నాయి. దీంతో నగరంలోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. చాలా చోట్ల రైల్వే ట్రాక్‌లపై నీళ్లు నిలవడంతో రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. పలు రైళ్లు రద్దవ్వడంతో వాటిల్లో నిలిచిపోయిన ప్రయాణికులను సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రైల్వే స్టేషన్లలో చిక్కుకుపోయిన ప్రయాణికులను కూడా సిబ్బంది వేరే ప్రాంతాలకు పంపిస్తున్నారు. నల్లాస్‌పొరా, వసాయ్‌ స్టేషన్ల మధ్య చిక్కుకుపోయిన దాదాపు 1500 మంది ప్రయాణికులను ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి రక్షించి సురక్షిత ప్రాంతాలకు పంపించారు. నేవీ కూడా రంగంలోకి దిగింది. స్టేషన్లలో నిలిచిపోయిన ప్రయాణికులకు దాదాపు 2వేల ప్యాకెట్ల ఆహారాన్ని పంచారు. బుధవారం కూడా రైళ్లు నెమ్మదిగా నడుస్తున్నాయి. అది కూడా కొన్ని ప్రాంతాల్లోనే. పశ్చిమ రైల్వే సర్వీసులు నిన్నటి నుంచే నిలిచిపోయాయి. పశ్చిమ రైల్వే అధికారుల విజ్ఞప్తి మేరకు నావికాదళానికి చెందిన సహాయక సిబ్బంది రంగంలోకి దిగి వరద ప్రాంతాల్లోనూ నడిచే ప్రత్యేకమైన వాహనాల ద్వారా రైల్వే స్టేషన్లలో చిక్కుకుపోయిన ప్రజలను కాపాడుతున్నారు. రహదారులు నీళ్లతో నిలిచిపోయిన కారణంగా విపరీతంగా ట్రాఫిక్‌ జామ్‌లు అవుతున్నాయి. వెస్టన్ర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. బుధవారం కూడా పశ్చిమ రైల్వే సర్వీసులు చాలా వరకు నిలిచిపోయాయి. పలు సెంట్రల్‌ రైల్వే రైళ్లు నడుస్తున్నాయి. విరార్‌, చర్చ్‌గేట్‌ స్టేషన్ల మధ్య ఐదు లోకల్‌ రైళ్లు నిర్దేశిత వేగంతో నడుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. చర్చిగేట్‌- భయందర్‌, విరార్‌-దహాను రోడ్‌ స్టేషన్ల మధ్య రైళ్లు సాధారణంగా నడుస్తున్నాయని తెలిపారు.