ముంబై ఇండియన్స్ తరఫున టెండూల్కర్ మళ్లీ బ్యాట్ పడ్తాడా?
బెంగళూరు: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మళ్లీ బ్యాట్ పట్టి మైదానంలోకి దిగుతాడా అనే ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. అతను ముంబై ఇండియన్స్ తరఫున ఐపిఎల్‌లో ఆడడానికి సిద్ధపడుతున్నాడా అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్‌లో టెండూల్కర్ తన ఫొటోను పోస్టు చేశాడు. ఈ ఫొటో చుట్టూ ఊహాగానాలు అల్లుకుంటున్నాయి. 2013 నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఐకాన్‌గా వ్యవహరిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ ఐపియల్ ట్రోఫీని గెలుచుకున్న తర్వాత అతను 2013లో ట్వంటీ20 క్రికెట్ నుంచి కూడా తప్పుకున్నాడు. ఐపిఎల్ 8లో భాగంగా కోల్‌కతాలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ ఈ నెల 8వ తేదీన ఆడిన మ్యాచును సచిన్ వీక్షించాడు. ముంబై ఇండియన్స్ ఈ మ్యాచును 7 వికెట్ల తేడాతో కోల్పోయింది. ముంబై ఇండియన్స్ తరఫున టెండూల్కర్ మళ్లీ బ్యాట్ పడ్తాడా? శనివారంనాడు సచిన్ టెండూల్కర్ హెల్మెట్ ధరిస్తున్నట్లున్న తన ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఈ ఎడిషన్‌లో సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ తరఫున మైదానంలోకి దిగుతాడా అనిపించేట్లు ఆ ఫొటో ఉండడం విశేషం. పైగా, గెస్ వాట్ అంటూ ఫొటో కింద రాశాడు. దాంతో ఊహాగానాలు మరింతగా చెలరేగుతున్నాయి. చివరికి సచిన్ టెండూల్కర్ ఏం చెబుతాడో అని అభిమానులు నిరీక్షిస్తున్నారు. ముంబై ఇండియన్స్ టెండూల్కర్ సొంత మైదానం వాంఖడేలో ఈ నెల 12వ తేదీన కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై మ్యాచ్ ఆడనుంది. 41 ఏళ్ల సచిన్ టెండూల్కర్ మరో సారి ప్యాడ్లు కట్టుకుంటాడా అనేది ఇప్పుడు ప్రశ్న.