ముఖ్యమంత్రి వివక్ష బయటపడింది

సుల్తానాబాద్‌, జనంసాక్షి : తెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి కుట్ర , వివక్ష అవిశ్వాస తీర్మానం సందర్భంగా మరోసారి వెలుగు చూశాయని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ ధ్వజమెత్తారు. శనివారం సుల్తానాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర సమస్యల పరిష్కారంలో విఫలమైనందుకు ముఖ్యమంత్రిపై అవిశ్వాసం ప్రతిపాదిస్తే.. ఆయన రాయలసీమ ముఖ్యమంత్రిగా వ్యవహరించి తెలంగాణపై వివక్ష చూపారన్నారు. తెలంగాణ ఉద్యమం విషయంలో చులకనగా మాట్లాడడం.. నిధులు ఇవ్వనని ప్రకటించడం ఆస్థాయిలో చేయదగినవి కావన్నారు. కార్యకర్తలు, నాయకులు స్థానిక సమస్యలపై దృష్టిసారించి స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు బిరుదు రాజమల్లు, అంతటి అన్నయ్యగౌడ్‌, ముత్యం రమేష్‌, వూట్ల వరప్రసాద్‌, గజబీంకర్‌ జగన్‌, దామోదర్‌దరావు, గోపి, అక్బర్‌ పాల్గొన్నారు.