ముగిసిన ఎన్నికల ప్రచార పర్వం
– 17 లోక్‌సభ స్థానాల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు
– 11న ఉదయం 7 నుంచి 5 వరకు పోలింగ్
– నిజామాబాద్‌లో 8 నుంచి 6 వరకు పోలింగ్
– నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 4వరకే పోలింగ్ పూర్తి
– క్యూలో నిలుచున్న వారికి ఓటేసే అవకాశం
– ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ వెల్లడి
హైదరాబాద్,ఏప్రిల్ 9(జనంసాక్షి): రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. 11వ తేదీ గురువారం ఎన్నికలు నిర్వహించ నున్నందున మంగళవారం సాయంత్రం 5 గంటలకల్లా రాజకీయపార్టీలు ప్రచారం ముగిసిందని అన్నారు. 11వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 4 వరకే పోలింగ్ ఉంటుందని చెప్పారు. 185 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలుచేసిన నిజామాబాద్ నియోజకవర్గంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వెల్లడించారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాక్ పోలింగ్ జరుగుతుందని, దీంతో పోలింగ్ సమయాన్ని సాయంత్రం ఆరువరకు పొడిగించినట్లు వివరించారు. మంగళవారం సాయంత్రం 5 నుంచి మద్యం దుకాణాలు బంద్ చేయాల న్నారు. పోలింగ్ ముగిసే సమయానికి పోలింగ్ కేంద్రానికి వచ్చినవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని సీఈవో రజత్‌కుమార్ చెప్పారు. పోలింగ్ సరళిని రాష్ట్రంలోని అన్ని పోలింగ్‌స్టేషన్లలో వీడియో రికార్డింగ్ చేస్తామన్నారు. 4,169 పోలింగ్‌స్టేషన్ల నుంచి వెబ్‌కాస్టింగ్ చేస్తామని తెలిపారు. నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలను చాలెంజింగ్‌గా తీసుకున్నామని, పోలింగ్ ఏజెంట్లు కూడా బయటే ఉంటారని, అక్కడ కూడా సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 6,645 సమస్యాత్మక పోలింగ్‌స్టేషన్లను గుర్తించామని, బయట సీసీ కెమెరాల ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను కోరామన్నారు. నక్సల్స్ ప్రభావిత నియోజకవర్గాలలో
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని సీఈవో రజత్‌కుమార్ తెలిపారు. రాష్ట్రంలో 2,97,08,599 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించు కోనున్నట్లు చెప్పారు. ఇందులో 1,49,30,726 మంది పురుషులు.. 1,47,76,370 మంది మహిళలు, 1504 మంది ఇతరులు, 11,320 మంది సర్వీస్ ఓటర్లు, 1,731 మంది ఎన్నారై ఓటర్లు ఉన్నట్లు రజత్‌కుమార్ వివరించారు. రాష్ట్రంలో 34,604 పోలింగ్‌స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ఫొటో ఓటర్ స్లిప్‌లను గుర్తింపుకార్డులుగా పరిగణించడం లేదని, ఈసీఐ ఆదేశాల మేరకు ఎపిక్ ఓటరు గుర్తింపు కార్డు లేదా మరో 11 రకాల కార్డుల్లో ఏదైనా ఒకటి పోలింగ్ కేంద్రానికి తీసుకురావాలని ఓటర్లకు సీఈవో సూచించారు. 1) పాస్‌పోర్ట్, 2) డ్రైవింగ్ లైసెన్స్, 3) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు/ ప్రభుత్వరంగ సంస్థలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీచేసిన ఉద్యోగుల ఫొటో గుర్తింపుకార్డు, 4) బ్యాంకులు, పోస్టాఫీసులు ఫొటోతోసహా జారీచేసిన పాస్ పుస్తకాలు, 5) పాన్‌కార్డు, 6) ఎన్పీఆర్ కింద ఆర్జీఐ జారీచేసిన స్మార్ట్‌కార్డు, 7) నరేగా జారీచేసిన ఉపాధిహావిూ పత్రం, 8) ఆరోగ్య బీమా కింద కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ జారీచేసిన స్మార్ట్‌కార్డ్, 9) ఫొటోజత చేసి ఉన్న పింఛన్ పత్రాలు, 10) ఎంపీ/ ఎమ్మెల్యే/ ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికారిక గుర్తింపు పత్రం, 11) ఆధార్ కార్డు.. వీటిల్లో ఏదో ఒక గుర్తింపుకార్డు చూపించినవారిని మాత్రమే ఓటు వేయనిస్తారని తెలిపారు. సొంత నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది పనిచేసేచోట ఓటు వేయడానికి వీలుగా ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్లు (ఈడీసీ) 80శాతం ఇచ్చామన్నారు. సోషల్‌విూడియాలో వస్తున్న వార్తలపై నిఘాపెట్టి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎంసీసీ అనుమానిత కేసులు 460 వచ్చాయని చెప్పారు. సీ-విజిల్‌కు మంచి స్పందన ఉందని రజత్‌కుమార్ చెప్పారు. చాలా మంది తనకు మెసేజ్‌లు చేశారన్నారు. సీ-విజిల్ ద్వారా1435 కేసులు బుక్ అయ్యాయని, అన్ని కేసులు వెంటనే పరిష్కరిస్తున్నామని తెలిపారు. నగదు పంపిణీ, మద్యం పంపిణీ కేసులు రుజువైతే ఎన్నికల్లో గెలిచినప్పటికీ పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని హెచ్చరించారు. కులమతాల పేరుతో ఓట్లు అడిగినట్లు రుజువైనా గెలిచిన అభ్యర్థిని ఎన్నికల కమిషన్ పదవి నుంచి తప్పిస్తుందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సెల్పీలు తీసుకుంటే చర్యలుంటాయని రజత్‌కుమార్ తెలిపారు. పోలింగ్ రోజున అన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు సెలవు ఇవ్వాలని తెలిపారు. లేకుంటే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు.