ముగిసిన నామినేషన్ల ఘట్టం
44 గంటల ముందే ప్రచారం ముగింపు
నిబంధనలను ఉల్లంఘిస్తే రెండేండ్ల జైలుశిక్ష
హైదరాబాద్,జనవరి19(జనంసాక్షి): తెలంగాణలో మూడువిడుతల్లో జరుగనున్న ఎన్నికలకు సంబంధించి పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ ముగిసింది. పంచాయతీ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అత్యవసర ఉత్తర్వులు జారీచేసింది. అన్ని విడుతల్లో పోలింగ్‌కు 44 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాలని.. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే రెండేండ్ల జైలుశిక్షతోపాటు, ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హత వేటువేస్తామని హెచ్చరించింది. అభ్యర్థులు నేరుగా, టీవీ, విూడియా, పత్రికల్లోనూ ప్రచారం చేయరాదని స్పష్టం చేసింది. ఆయాగ్రామాల్లో నామినేషన్లు దాఖలుచేసేందుకు చివరి రోజు అభ్యర్థులు బారులుతీరారు. మొత్తం 4,116 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు 9,773 నామినేషన్లు దాఖలయ్యాయి. 36,729 వార్డుస్థానాలకు 27,273 నామినేషన్లు వచ్చాయి. మూడవ విడుతలో భాగంగా నామినేషన్ల పరిశీలనచేసి, అర్హతపొందిన నామినేషన్ల జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు. ఆదివారం అభ్యంతరాలను స్వీకరించి, 22న తుది జాబితా ప్రకటించనున్నారు. ఇక కామారెడ్డి జిల్లాలో 23, ఆదిలాబాద్‌లో 50, నిర్మల్‌లో 8, నిజామాబాద్‌లో 38, వరంగల్ రూరల్‌లో 18, వరంగల్ అర్బన్‌లో 3, నల్లగొండలో 4, కరీంనగర్‌లో మూడు, పెద్దపల్లిలో ఒకటి, జగిత్యాలలో 6, రాజన్న సిరిసిల్లలో 9, జోగులాంబ గద్వాలలో 2, వికారాబాద్‌లో 10, జనగామ 4, మంచిర్యాలలో 2, జగిత్యాలలో 6 చొప్పున పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మరోవైపు తొలితవిడుత పోలింగ్‌కు సర్వం సిద్ధమయింది. తొలివిడుత పోలింగ్ ఎల్లుండి జరుగనుండగా.. సాయంత్రం 5 గంటలతో ప్రచారపర్వానికి తెరపడనున్నది. ప్రతి విడుతలో పోలింగ్‌కు 44 గంటల ముందు ప్రచారం ముగించాలని రాష్ట్రఎన్నికల సంఘం మరోసారి ఉత్తర్వులు జారీచేసింది. తొలివిడుతలో 4,479 గ్రామాలకు ఎన్నికలు జరుగాల్సి ఉండగా.. రిజర్వేషన్లు, కోర్టుకేసుల నేపథ్యంలో తొమ్మిదిచోట్ల నిర్వహించడం లేదు. ఈ పంచాయతీల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలుకాలేదు. మంచిర్యాల జిల్లాలో 2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2, నాగర్‌కర్నూల్ జిల్లాలో 5 గ్రామాల సర్పంచ్‌లు, వాటి పరిధిలోని మొత్తం 192 వార్డులకు ఎన్నికలు జరుగడం లేదు. తొలివిడుతలో మొత్తం 769 పంచాయతీల్లో పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగిలిన 3,701 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 12,202 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అదేవిధంగా 10,654 వార్డుస్థానాలు ఏకగ్రీవ మయ్యాయి. మిగిలిన 28,976 వార్డుల్లో 70,094 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. తొలివిడుత పంచాయతీ ఎన్నికల ప్రచారం ఈ నెల 14న ప్రారంభమైంది. తమకు కేటాయించిన గుర్తులతో అభ్యర్థులు విస్తృతంగా ప్రచారంచేశారు. టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులపక్షాన పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రచారం చేశారు. రెండో విడుత ప్రచారం కొనసాగుతున్నది.