ముగిసిన పంచాయితీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం
హైదరాబాద్,జనవరి19(జనంసాక్షి): తెలంగాణలో మూడు విడుతల్లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ముగియడంతో, పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తొలిదశ ఎన్నికల
గడువు సవిూపిస్తుండటంతో బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని ఇంటింటికీ తీసుకెళ్తున్నారు. తమకు కేటాయించిన గుర్తులను ఓటర్లకు వివరిస్తూ గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.టీఆర్‌ఎస్ పార్టీ ఎక్కువ సంఖ్యలో సర్పంచ్, వార్డు మెంబర్ల పదవులను కైవసం చేసుకునేందుకు, ఉప సర్పంచ్ పదవులను సైతం చేజిక్కించుకునేందుకు ఆయా గ్రామాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు తమవంతు కృషి చేస్తున్నారు. ఎన్నికల సందడితో పల్లెలన్నీ రాజకీయ చర్చలతో వేడెక్కుతున్నాయి. ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ మైక్‌లు, హంగామాలు లేకుండా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకొని తమను గెలిపించాలని గుర్తులను పరిచయం చేస్తున్నారు. తొలివిడత ఎన్నికల పోలింగ్ సోమవారం జరగనుంది. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మూడో విడత నామినేషన్ల దాఖలు గడువు శుక్రవారంతో ముగిసింది. జిల్లాల్లోని అనేక పంచాయతీల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు అనధికార సమాచారం ప్రకారం తెలిసింది. పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది. మొదటి విడత, రెండో విడత ఎన్నికల ప్రచారం శుక్రవారం నుంచి ఊపందుకుంది. పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల ఘట్టం కోలాహలంగా జరగడంతో పాటు శుక్రవారంతో ముగిసింది. చివరిరోజు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఎక్కడికక్కడ మంతనాలు జరుపుతూ.. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రాజకీయాలకతీతంగా కొందరు వ్యూహరచన చేస్తుండగా రాజకీయ పార్టీల మద్దతుతో మరికొందరు గెలుపుకోసం పావులు కదుపుతున్నారు.