ముచ్చటగా మూడోసారి….

జీవన్ రెడ్డికే బీఆర్ఎస్ టికెట్ …..-ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల హర్షాతిరేకాలు-గులాబీ శ్రేణుల సంబురాలు-బాణసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూఆనందోత్సవాలు-హ్యాట్రిక్ విజయంపై బీఆర్ఎస్ నజర్-ఉద్యమకారుడి నుంచి ఉన్నత స్థాయికి…-అంచెలంచెలుగా ఎదుగుతున్న జీవన్ రెడ్డి-కేసీఆర్ కు జీవన్ రెడ్డి పాదాభివందనం..ఆర్మూర్, ఆగస్టు21:-ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ టికెట్ ముచ్చటగా మూడోసారి ప్రస్తుత ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికే లభించింది. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం తెలంగాణ భవన్ లో విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల జాబితాలో
జీవన్ రెడ్డికే బీఆర్ఎస్ టికెట్ దక్కడంతో
ఆర్మూర్ నియోజక వర్గ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
గులాబీ శ్రేణుల సంబురాలు నియోజకవర్గ వ్యాప్తంగా మిన్నంటాయి.
జీవన్ రెడ్డికి మూడోసారి కూడా బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడాన్ని స్వాగతిస్తూ గులాబీ శ్రేణులు బాణసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ ఆనందోత్సవాలు జరుపుకున్నారు. నియోజకవర్గమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఆర్మూర్ పట్టణమంతా బీఆర్ఎస్ కార్యకర్తల కోలాహలంతో సందడిగా కనిపించింది.
ఆర్మూర్ స్థానం నుంచి మరోసారి జీవన్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఆయన హ్యాట్రిక్ విజయంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. ఇప్పటికే జీవన్ రెడ్డి రెండు పర్యాయాలు నియోజకవర్గమంతా కలియతిరిగి బీఆర్ఎస్ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేశారు. బూత్ ల వారీగా పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లి ప్రజల్లో చర్చపెట్టాలని దిశానిర్దేశం కూడా చేశారు. గత పదేళ్లుగా అన్నివర్గాల ప్రజలకు అత్యంత ఆత్మీయనేతగా పేరు తెచ్చుకున్న జీవన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమంలో ఆర్మూర్ నియోజకవర్గాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఫలితంగా జీవన్ రెడ్డి ని అభిమానిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఆయనకు మద్దతు తెలుపుతుండడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ లోకి చేరికల పరంపర కొనసాగుతోంది. తాజాగా బీఆర్ఎస్ అభ్యర్థిత్వం కూడా ఖరారు కావడంతో జీవన్ రెడ్డి ఇక పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించనున్నారు.
——————
ఉద్యమకారుడి నుంచి ఉన్నత స్థాయికి..

-అంచెలంచెలుగా ఎదుగుతున్న జీవన్ రెడ్డి
——————–
ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టికెట్ దక్కించుకోవడంలో హ్యాట్రిక్ సాధించి హ్యాట్రిక్ విజయం దిశగా అడుగులు వేసేందుకు పావులు కదుపుతున్న జీవన్ రెడ్డి ప్రస్థానాన్ని నెమరువేసుకుంటే…
సామాన్య రైతు కుటుంబం నుంచి తెలంగాణ ఉద్యమకారుడి వరకూ, స్వరాష్ట్ర సాధన తరువాత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధిగా ఉన్నత స్థాయికి జీవన్ రెడ్డి అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలంలోని జంకంపేట్ గ్రామంలో
జీవన్‌రెడ్డి 1976, మార్చి 7న వెంకటరాజన్న, రాజాబాయి దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి వెంకట రాజన్న గతంలో జంకంపేట్ గ్రామ ఉపసర్పంచ్ గా పనిచేయగా, మామ యాల్ల రాములు ఆర్మూరు ఎంపీపీ గా పనిచేశారు. జీవన్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రులై నిజామాబాద్ బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం పీహెచ్ డీ చేస్తున్నారు.
జీవన్ రెడ్డికి రజితారెడ్డితో వివాహం జరగగా వారికి ఇద్దరు కుమార్తెలు అనౌషికా రెడ్డి, అనణ్య రెడ్డి ఉన్నారు.రాజకీయ ప్రస్థానంకేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన మలి విడత తెలంగాణ ఉద్యమంలో జీవన్ రెడ్డి కీలకపాత్ర వహించారు. అనేక ఉద్యమాలలో పాల్గొని జైళ్ల పాలయ్యారు. బకాయిల కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడుతున్న ఎర్ర జొన్న రైతులకు బాసటగా నిలిచిన జీవన్ రెడ్డి రైతులకు మద్దతుగా నిరాహారదీక్ష చేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులచే కాల్పులు జరిపించినా భయపడకుండా పోరాడిన చరిత్ర జీవన్ రెడ్డికి ఉంది. స్వరాష్ట్రం వచ్చిన తరువాత కేసీఆర్ తో మాట్లాడి ఎర్రజొన్న రైతులకు బకాయిలు ఇప్పించారు. ఉద్యమ కాలంలో
జీవన్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడుగా, ఆర్మూర్‌ నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జిగా పని చేసిన అనుభవం ఉంది. 2014లో స్వరాష్ట్రంలో జరిగిన మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పార్టీ తొలి టికెట్ పొందిన ఉద్యమ నేతగా జీవన్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందారు. కేసీఆర్ ఆశీస్సులతో ఆర్మూర్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన జీవన్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి కేతిరెడ్డి సురేష్‌రెడ్డిపై 13,964 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకుల లలిత పై 28,795 ఓట్ల మెజారిటీతో రెండోసారి గెలుపొంది అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.
తెలంగాణ రాష్ట్ర సమితి తరపున ప్రధాన వక్తగా, తెలంగాణ ప్రభుత్వం తరపున అనేక వార్తా ఛానళ్ళలో ప్రత్యక్ష చర్చల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత విశ్వాస పాత్రుడిగా పేరు తెచ్చుకున్నారు. కేసీఆర్ ను ఆరాధించడం తప్ప మరేమీ తెలియని జీవన్‌రెడ్డి కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో ఒకరనే విధంగా ఇమిడిపోయారు. కాగా జీవన్ రెడ్డి సమర్థతను గుర్తించిన సీఎం కేసీఆర్ ఆయనను తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థల కమిటీ (పీయూసీ) చైర్మన్‌గా నియమించగా 2019 అక్టోబరు 31న పదవీ బాధ్యతలు స్వీకరించారు. 26 జనవరి 2022న బీఆర్ఎస్ పార్టీ నిజామాబాదు జిల్లా అధ్యక్షుడిగా జీవన్ నియమితుడై ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్నారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అత్యంత విధేయుడుగా పేరు తెచ్చుకున్న జీవన్ రెడ్డి ఆయన నేతృత్వంలో విదేశీ పర్యటనలో భాగంగా సింగపూర్, మలేషియా వంటి దేశాలను సందర్శించారు. మంత్రి
కల్వకుంట్ల తారక రామారావుతో కలిసి గ్రామ పంచాయతీ వ్యవస్థలో సంస్థాగత నిర్మాణం అధ్యయనం కోసం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో సందర్శించారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యేందుకు వివిధ సోషల్ నెట్‌వర్కింగ్ మీడియా ద్వారా ప్రజలతో నిరంతరం టచ్‌లో ఉంటారు.
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 3 నెలల స్వల్ప వ్యవధిలోనే పోచంపాడు నుంచి ఆర్మూరు వరకు ప్రతిష్టాత్మకమైన తాగునీటి పథకాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రారంభించి మాట నిలుపుకున్న జీవన్ రెడ్డి గత పదేళ్ళ కాలంలో దాదాపు మూడు వేల కోట్ల రూపాయల నిధులు సాధించి ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిపారు. నిరంతరం నియోజజవర్గాన్నే అంటిపెట్టికొని ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండటం జీవన్ రెడ్డి ప్రత్యేకత. మంచైనా, చెడైనా ప్రతీ ఇంటికి వెళ్లి నేనున్నానంటూ బాసటగా నిలిచే తత్వంతో జీవన్ రెడ్డి సబ్బండ వర్గాల అభిమానాన్ని చూరగొన్నారు. కాగా జీవన్ రెడ్డికి మళ్లీ ఆర్మూర్ టికెట్ ఇచ్చిన కేసీఆర్ కు పార్టీ శ్రేణులు ధన్యవాదాలు తెలిపారు. జీవన్ రెడ్డికి 60వేలకు పైగా మెజార్టీతో హ్యాట్రిక్ విజయం చేకూర్చి కేసీఆర్ కు కానుకగా ఇస్తామని బీఆర్ఎస్ శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలు ఎక్కడికక్కడ తీర్మానాలు చేస్తున్నారు.కేసీఆర్ కు జీవన్ రెడ్డి పాదాభివందనంతనపై ఎంతో నమ్మకంతో ఆర్మూర్ నుంచి మూడోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాదాభివందనం చేశారు. కేసీఆర్ నమ్మకాన్ని నిజం చేస్తూ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో హ్యాట్రిక్ విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనకు టికెట్ ఇచ్చిన కేసీఆర్ కు ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటు న్నానని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు.