ముద్రగడతో ప్రకాశ్ అంబేడ్కర్ భేటీ
కాకినాడ,జూన్11(జనం సాక్షి): తూర్పుగోదావరి జిల్లా కాపు ఉద్యమనేత ముద్రగడను బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కిర్లంపూడి ఏనుగు వీధి సెంటర్లో ఉన్న బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇటీవలి కాలంలో కాపు ఉద్యమంతో ముద్రగడ చేస్తున్న పోరాటాన్ని తెలుసుకున్నారు. ఇదిలావుంటే టిడిపి ప్రభుత్వ విధానాలపై పోరాటానికి జగన్, పవన్‌కళ్యాణ్ సహా అన్ని పార్టీల నేతలూ ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. సోమవారం ముద్రగడ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా దేశంలో విదేశీ పాలన పోయిందని.. కానీ ఎపిని సింగపూర్ పాలిత ప్రాంతంగా చేయడానికి చంద్రబాబునాయుడు తహతహలాడుతున్నారని విమర్శించారు. అమరావతి భూములను సింగపూర్ కంపెనీలకు ఇస్తామని ప్రకటించిన జూన్ 7న ఎపికి చీకటి రోజని ఆ లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు పాలనా విధానాలపై యుద్ధభూమిలో తేల్చుకోవడానికి వైసిపి అధినేత జగన్, జనసేన అధినేత పవన్‌లు ప్రణాళిక రూపొందించాలని ముద్రగడ అభిప్రాయపడ్డారు. వారిద్దరూ యాత్రలకు కొంత విరామ ప్రకటించి ఈ దిశగా ఆలోచించాలని కోరారు. ప్రజల కోసం నిరంతరం పోరాడే కమ్యూనిస్టులను కలుపుకుని చంద్రబాబుపై పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు.