మునుగోడు సరే.. మన ముచ్చటేంది..?
బోడుప్పల్, పీర్జాదిగూడలో సమస్యలన్నీ ఎక్కడేసిన గొంగళి అక్కడే..
ఫోటోలకు ఫోజులు తప్ప పరిష్కరించని నేతలు
తీర్మానం చేసిన పనులు కూడా ముందుకు సాగని వైనం
మేడిపల్లి – జనంసాక్షి
ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోత అన్న సామెత బోడుప్పల్, పీర్జాదిగూడ జంట కార్పొరేషన్ల పరిధిలోని నేతలకు సరిగ్గా సరిపోతుంది. “తాను దూర సందులేదు మెడకేమో డోలా” అన్నట్టుగా సమస్యలను పక్కనబెట్టి ఇతరత్ర పనుల్లో మునిగి తేలడం వారికి పరిపాటిగా మారిందనే చర్చ మొదలైంది. అసలే సీజనల్ వ్యాధులు పొంచి ఉన్న తరుణంలో పరిశుభ్రత పనులు పూర్తి చేయకుండా అలక్ష్యం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కుక్కల బెడదతో పాటు డ్రైనేజీ, ఇతర ప్రాజెక్టులు నత్తను తలపిస్తున్నాయి.
బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సమస్యలు తిష్టవేసి స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తోండగా.. పాలకులు మాత్రం మునుగోడు ప్రచారంలో బిజీబిజీగా గడపడం ప్రజల ఆగ్రహానికి గురవుతోంది. ఇక్కడి సమస్యలు వదిలేసి అక్కడే రోజుల తరబడి ఉండటంతో పాలనా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా బోడుప్పల్ విషయంలోనైతే మౌలిక సదుపాయాల కల్పనలో ఎనలేని నిర్లక్ష్యం కనబడుతోందనీ ప్రజలు మండిపడుతున్నారు. కుక్కలు, పందులు స్వైర విహారం చేస్తూ.. ఇంట్లోంచి కాలు బయట పెట్టని పరిస్థితి తీసుకొచ్చినా నాయకులకు చీమ కుట్టినట్లు కూడా లేదని వాపోతున్నారు. చెంగిచెర్ల మెయిన్ రోడ్డులో డ్రైనేజీ పనులను అర్ధాంతంగా నిలిపివేయడం వాహనదారులు, స్థానికులకు అంతరాయం కలిగిస్తోంది. 110 కోట్లతో జంట కార్పొరేషన్లలో నిర్మాణం చేస్తున్నటువంటి ఎస్ ఎన్ డి పి పనుల పట్ల అలసత్వం కొనసాగుతూనే ఉంది. డ్రైనేజీలు పొంగడం, వాటిని సరిచేయలేనటువంటి దుస్థితిలో పాలకువర్గం కొట్టుమిట్టాడుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోడుప్పల్ 20వ డివిజన్లో డ్రైనేజీ నిర్మాణం జరిగాక కూడా రోడ్ల నిర్మాణం చేపట్టడం లేదని కాలనీవాసులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నా ఎవరికి పట్టడం లేదు. బోడుప్పల్ లో నిన్న గాక మొన్న కట్ట మైసమ్మ వైన్ షాప్ దగ్గర ఓ వ్యక్తి మరణించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
పీర్జాదిగూడలోనూ అంతే..
పీర్జాదిగూడలో డ్రైనేజీలు పొంగుతున్నాయని ఒకవైపు ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శించడం పరిపాటిగా మారినా స్పందన కరువైంది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించే మేయర్ మార్క్ పాలన ఇప్పుడు లేకపోవడం శోచనీయం. స్ట్రీట్ వెజిటేబుల్ మార్కెట్లు త్వరలో ప్రారంభిస్తామని గొప్పలు చెప్పుకున్న పాలకవర్గం ఇప్పటివరకు కొన్ని ఏరియాలలో ప్రారంభించకపోవడం, నిర్మాణం జరిగాక కూడా వాటికి మోక్షం లభించకపోవడం గమనార్హం. బహిరంగ మలవిసర్జన చేయొద్దని చెప్పినటువంటి పాలకవర్గం ప్రజలకు మరుగుదొడ్లు అందుబాటులో ఉంచకపోవడం, కొన్నిచోట్ల అలంకరణప్రాయంగా మరుగుదొడ్లు నిర్మించిన వాటిని అందుబాటులోకి తేవకపోవడం బాధాకరం.
తీర్మానం చేసినా తిప్పలే..
పొద్దున లేస్తే ఫోటోలకు ఫోజులు ఇచ్చే నాయకుల పరిస్థితి ఎలా ఉన్నా అధికారులు కూడా అలాగే మారారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిల్ తీర్మానాలు జరిగాక కూడా అధికారులు కొన్ని పనులను త్వరగా పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులో తేవకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే ఆసరా పింఛన్ల కోసం వృద్ధులు పడ్డ పాట్లు అధికారుల వైఫల్యాన్ని ఎండగట్టాయి. ఇలా ఏ డివిజన్ తీసుకున్నా ఏదోక సమస్య నిత్యం వేధిస్తూనే ఉన్నదని ప్రజలు వాపోతున్నారు. మరొకవైపు ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు కూడా పాలకులకు మేమేం తీసిపోలేమన్నట్టుగా వ్యవహరించడం శోచనీయం.
2 Attachments • Scanned by Gmail
ReplyForward
|