మున్సిపాలిటీల్లో ఎల్‌ఇడి వెలుగులు

కొత్తగూడెం,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): కొత్తగూడెం ఇక ఎల్‌ఇడి బల్బులతో జిగేల్‌మననుంది. ఈ మేరకు పట్టణంలో ఈ బల్బుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కరెంట్‌ ఆదా కాగలదని, మున్సిపాలిటీకి విద్యుత్‌ భారం తగ్గనుంది. కొత్తగూడెంతో పాటు ముప్పై మున్సిపాలిటీలలో ఎల్‌ఈడీ బల్బులే వినియోగించేందుకు అవసరమైన ప్రణాళికను చేసింది. కొత్తగూడెం నియోజకవర్గంలోని కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను కూడా ఈ జాబితాలో చేర్చింది. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌లిమిటెడ్‌కు చెందిన సిబ్బంది ఈ పట్టణాలలో సర్వే పూర్తి చేశారు. రాష్ట్రంలోని ఎంపిక చేసిన మున్సిపాలిటీలలో ఈ సంస్థనే ఎల్‌ఈడీ బల్బులను అమర్చేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మరో నెలరోజుల్లో బల్బులను అమర్చే పనిని ప్రారంభించే అవకాశం ఉంది.కొత్తగూడెం మున్సిపాలిటీలలోని 33వార్డులలో ఇలా వీధి దీపాలను అమర్చనున్నారు. మున్సిపాలిటీలో ఇప్పుడున్న వీధిదీపాల స్థానంలవీటిని అమరిస్తే ప్రతిరోజు సుమారు రూ.4500లు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా నెలకు రూ.1.35లక్షలు విద్యుత్‌ బిల్లు భారం తగ్గనుందని అంచనా. ఎల్‌ఈడీ బల్బుల వినియోగంలో ప్రతి స్తంభానికి ఐడెంటిఫికేషన్‌ మార్కు ఇవ్వడం ద్వారా ఎక్కడ ఏ లైట్‌ వెలుగకపోయినా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. వెంటనే దాని సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు వీలుగా ఉంటుంది.