ములుగు జిల్లాలో అటవీ సంపదను సంరక్షించాలి.
పోడు రైతు అర్హులకు పట్టాలు అందించుటకు అటవీ,రెవెన్యూ,పోలీస్ శాఖలు
సమన్వయంతో త్వరితగతిన చర్యలు తీసుకోవాలి…
రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.
ములుగు బ్యూరో,సెప్టెంబర్20(జనం సాక్షి):-
ములుగు జిల్లాలో అటవీ సంపదను సంరక్షించుకోవడంతోపాటు అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖ లు సమన్వయంతో పోడు రైతు అర్హులకు పట్టాలు అందించి, హక్కు కల్పించేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సత్వర చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోడు వ్యవసాయ భూముల జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జెడ్పి చైర్మన్ కుసుమ జగదీష్, జిల్లా కలెక్టర్ యస్. కృష్ణ ఆదిత్య, ఐటిడిఏ పిఓ అంకిత్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్,డిఎఫ్ఓ లావణ్య లతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కువ అడవులు ఉన్న జిల్లా ములుగు అని తాడువాయి మండలం లింగాల, బంధాల గ్రామాలలో పోడు భూముల సమస్య ఎక్కువ ఉన్నాయన్నారు. పోడు భూముల పట్టాల సమస్య పరిష్కారనికి క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ననుసరించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ. విడుదల చేసిందని,ప్రభుత్వ మార్గదర్శకాల కనుగుణంగా సంబంధిత శాఖలు సమన్వయం తో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.చట్టం అమలులోకి వచ్చిన అనంతరం వచ్చిన విజ్ఞప్తుల కు అర్హులను గుర్తించి పట్టాలు ఇవ్వడం జరిగిందని, జిల్లాకు సంబంధించి ఇంకనూ 91 వేల 843 ఎకరాలకు గాను 34,044 దరఖాస్తులు వచ్చాయని, వాటిని క్షేత్ర స్థాయిలో టెక్నికల్ సిబ్బంది బృందాలతో సర్వే చేపట్టి పరిశీలన చేయాలని మంత్రి అన్నారు.అదే విధంగా అటవీ సంపదను కాపాడుకోవడం తో పాటు, భవిష్యత్తులో ఆక్రమణ కు గురి కాకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.అరుహులైన ప్రతి ఒక్కరికి పోడు భూముల పట్టాలు అందించి, హక్కు కల్పించేందుకు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మంత్రి అన్నారు.
జెడ్పి చైర్మన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ ములుగు అడవి జిల్లాని ఆదివాసులు ఎక్కువ ఉన్న ప్రాంతమని పోడు భూముల సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో త్వరలో నిర్ధారణ కమిటీ రిపోర్ట్ ప్రకారం పోడు రైతులకు పట్టాలు జారీ చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన అన్నారు.జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ ఏజెన్సీ గ్రామాలలో పోడు రైతుల సమస్యలు పరిష్కరించాలని పొడు రైతులకు ఇంతకు ముందుకు పట్టాలు జారీ చేసిన వారికి బోర్లు వేసుకోవడానికి ఫారెస్ట్ అధికారులు అనుమతి ఇవ్వాలని, పోడు భూములలో వ్యవసాయం చేయుటకు ట్రాక్టర్లు వెళ్ళుటకు అనుమతి ఇవ్వలని ఆమె కోరారు.ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ననుసరించి జిల్లా మంత్రివర్యులు సారథ్యం లో జిల్లా స్థా యి కమిటీ ఏర్పాటు చేసి పోడు భూముల సమస్య పరిష్కారానికి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిందని పార్లమెంట్ సభ్యులు ,స్థానిక శాసనసభ్యులు ,జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఎస్పీ, జిల్లా అటవీశాఖ అధికారి ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారులు సభ్యులుగా ఉంటారని జిల్లా కలెక్టర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారని కలెక్టర్ తెలిపారు.జిల్లాలో పట్టాల జారీకై 34,044 దరఖాస్తులు వచ్చాయని వీటి పరిష్కారానికి గాను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇప్పటికే నియమించబడిన ఫారెస్ట్ రైట్స్ కమిటీల తోపాటు జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలన, సర్వే నిర్వహించేందుకు 174 గ్రామ పంచాయతీలలోని ప్రతి హ్యాబిటేషన్లలో ఇట్టి ప్రక్రియ నిర్వహించేందుకు బృందాలను ఏర్పాటు చేసి సర్వే చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్,డిఆర్ఓ కే.రమాదేవి డివిజినల్ ఫారెస్ట్ అధికారి బాజీరావు పటేల్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పళ్ళ బుచ్చయ్య,జడ్పిటిసిలు,ఎంపీపీలు, ఎంపిటిసి లు,జిల్లా అధికారులు,తహసీల్దార్లు,ఎంపిడిఓ లు, ఫారెస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.