ముస్లింలకు రాజకీయ వాటా లేదా?
సాయం, సహకారం కాదు.. ఇచ్చే స్థానాలు ఎన్ని?
పాతబస్తీ మినహా ఏ నియోజకవర్గంలోనూ దక్కని ప్రాధాన్యత
దశాబ్దాలుగా వెనుకబాటులో ఉన్నా.. ఎందుకింత ఉదాసీనత
బీజేపీ బూచీ చూపి ముస్లిం సమూహాన్ని ప్రతిసారీ బుజ్జగిస్తున్న పార్టీలు
చట్టసభల్లోకి అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకుంటున్న వైనం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీలకు ఎదురవుతున్న ప్రశ్నలు
ఎన్నో దశాబ్దాలుగా వెనుకబాటు వెంటాడుతోందని సచార్ కమిటీ నివేదిక స్పష్టం చేస్తున్నా వారికి తగిన ప్రాధాన్యత దక్కడం లేదు. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఎస్టీ, ఎస్టీలకంటే అట్టడుగు స్థాయిలో ఉన్నారని తెలుస్తున్నా.. కేవలం ఓటు బ్యాంకుగానే వారు మిగిలిపోతున్నారు. ఊకడదంపుడు ఉపన్యాసాలు తప్పితే ప్రతిసారీ వారిపట్ల నేతలు ఉదాసీన వైఖరే ప్రదర్శిస్తున్నారు. ఇక రిజర్వేషన్ల సంగతైతే ఉమ్మడి రాష్ట్రం నుంచి సా..గుతున్నదే! అటు ఆర్థికంగా, సామాజికంగా, ఇటు రాజకీయంగా వివక్షకు గురవుతున్న ముస్లిం మైనార్టీ వర్గాలకు తెలంగాణ చట్టసభల్లో దక్కుతున్న స్థానాల గురించి ప్రశ్నిస్తే.. రాజకీయ పార్టీలు ‘గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు’ సూత్రాన్ని పాటిస్తున్నాయి. కేవలం బీజేపీ బూచీ చూపి ముస్లిం సమూహాన్ని ప్రతిసారీ బుజ్జగించడం పార్టీలకు పరిపాటిగా మారిపోయింది.
హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో దాదాపు యాభై లక్షల జనాభా గల ముస్లిం మైనార్టీలు మొత్తంగా 14శాతంపైగా ఉన్నారు. దాదాపు సగం నియోజకవర్గాల్లో తమ ఓట్ల ద్వారా గెలుపోటములు ప్రభావం చూపగలిగే సంఖ్యాబలం ఉంది. అయినప్పటికీ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు చట్టసభల్లో వారికి సరైన న్యాయం జరగడం లేదు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ కేవలం 4శాతంతో సరిపెట్టి చేతులు దులిపేసుకున్నారు. స్వరాష్ట్రంలోనూ ముస్లింలకు రాజకీయంగా ఎలాంటి మార్పూ లేదు. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ మినహా మిగతా ఎక్కడా వారికి పోటీ చేసే అవకాశం లభించడం లేదు. ఇటీవల బీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితాలోనూ బోధన్ మినహా మరెక్కడా చోటు దక్కలేదు. బహదూర్‌పురా, చార్మినార్‌లో నామమాత్రంగా ఇద్దరిని ప్రకటించినప్పటికీ ఎలాగోలా అవి ఎంఐఎంకు పట్టున్న స్థానాలుగా పరిగణించక తప్పదు. గత ఎన్నికల సందర్భంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా జీహెచ్‌ఎంసీ పరిధిలో 6 స్థానాలు కేటాయించి, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్ నుంచి మరో ఇద్దరికి అవకాశం కల్పించింది.
ఏదీ చిత్తశుద్ది..?
గత తొమ్మిదేళ్లలో బీఆర్‌ఎస్ నుంచి ఒకరు, ఎంఐఎం నుంచి ఏడుగురు అసెంబ్లీలోకి అడుగుపెడితే కాంగ్రెస్ నుంచి ఒక్కరు కూడా గెలుపొందలేదు. పలు నియోజకవర్గాల్లో మంచి పట్టున్నప్పటికీ అక్కడ ముస్లింలకు అసెంబ్లీ స్థానం కేటాయించకపోవడమే ఇందుక్కారణంగా తెలుస్తోంది. కేవలం ఎంఐఎం పోటీచేస్తున్న స్థానాల్లోనే అభ్యర్థులను కేటాయించేందుకు నిర్ణయిస్తున్న పార్టీలు.. సాధారణ స్థానాల్లో మాత్రం విస్మరించడం గమనార్హం. మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, కరీంనగర్, నిజామాబాద్, బోధన్, హుజురాబాద్, హుజుర్‌నగర్, కామారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లాలతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ముస్లింల ఓటు బ్యాంకు ఎక్కువగానే ఉంది. కానీ అలాంటిచోట మరో సామాజికవర్గం ఓట్లు కోల్పోతామేమోనని భావిస్తున్న పార్టీలు.. బీజేపీ బూచీగా కుంటిసాకులు చెబుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీలో తీర్మానించి, నిర్ణయం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి పంపారు. అయితే తెలంగాణలో అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం.. ముస్లింపట్ల ఎలాంటి చిత్తశుద్ధితో ఉన్నదో అందరికీ తెలిసిందే.
కర్నాటక ‘మంత్ర’.. పార్టీలకు ఎంత?
బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైపోగా.. ఇక మిగిలింది కాంగ్రెస్, బీజేపీ..! ముస్లింల పట్ల కమలం పార్టీ వైఖరి ఎలాంటిదో యావత్ సమాజానికి స్పష్టం. ఈ నేపథ్యంలో త్వరలోనే అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను వెల్లడిరచే ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ముందున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి ఏకంగా 50మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా.. ముస్లింలు బలంగా ఉన్న నియోజకవర్గాల నుంచి డిమాండ్లు ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవలే జరిగిన కర్ణాటక ఎన్నికల్లో 15 మంది ముస్లిం నాయకులకు టికెట్లు ఇస్తే తొమ్మిది మంది గెలుపొందారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కూడా దాదాపు 15 సీట్లు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తున్నది. దాదాపు 14శాతం ఉన్న ముస్లింలకు ఎక్కువ టికెట్లు ఇస్తే మిగితా నియోజకవర్గాల్లోనూ ఈ ప్రభావం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఏ మేరకు దక్కుతుందో ఎదురుచూడాలి.