ముస్లిం రిజర్వేషన్ల సాధనకు ఉద్యమించాలి : కోదండరాం పిలుపు
హైదరాబాద్- తమకు ఉద్దేశించిన రిజర్వేషన్లు సాధించుకునేందుకు ముస్లిలంతా కలిసికట్టుగా ఉద్యమించాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. ఆదివారం లక్కడ్‌కోట్‌లో మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో ‘రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫారసుల అమలు ‘అనే అంశంపై ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వాలకు మొరపెట్టుకోవడం, అమాత్యులకు వినతిపత్రాలు సమర్పించడం ద్వారా రిజర్వేషన్లు సాధించుకుందామని ముస్లింలు భావిస్తే పొరపాటే అవుతుందన్నారు. ముస్లింలు తమకు ఉద్దేశించిన రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమించాలని, ఇందుకు కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. దివంగత తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్‌సార్ ఎప్పుడు ఉద్యమం చేపట్టినా వెనుకడుగు వేయరాదని, ఏదైనా సాధించాలంటే పోరాటం చేయడమే శరణ్యమనే వారని, రాజకీయ పార్టీల సహకారంతో చట్టసభల్లో వాటిపై చర్చించి అమలయ్యేటట్లు పాటుపడితే ఏదైనా సాధించవచ్చని ఆయన చెప్పేవారని కోదండరాం గుర్తు చేశారు. ఉద్యమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేగలిగితే 2014 కన్నా ముందే ముస్లింల రిజర్వేషన్లు సాధించుకోవచ్చన్నారు.
అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న ముస్లింల బతుకులు బాగుపర్చేందుకు రంగనాథ మిశ్రా కమిషన్ సిఫారసులు వెంటనే అమలు చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. ముస్లిం అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారిని అభివృద్ధి కోసం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని రంగనాథ కమిషన్ కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేసినా ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. ముస్లింల అభ్యున్నతి, సంక్షేమంపై ప్రభుత్వాలకు ఉన్న చిత్తిశుద్ధి ఏపాటిదో అవగతమవుతోందని ఆయన పేర్కొన్నారు.గతంలో ముస్లింలు అన్ని రంగాల్లో ముందుండే వారని, ఆంధ్రప్రదేశ్‌లో నిజాం స్టేట్ ఆవిర్భావం నుంచి ముస్లింలు వెనుకబడ్డారని ఆయన పేర్కొన్నారు. గతంలో కళాశాలల్లో ముస్లిం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండేదని, రిజర్వేషన్ల తర్వాత వారి సంఖ్య పెరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు జాహెద్ అలీఖాన్ మాట్లాడుతూ, దేశాన్ని ముస్లింలు 800 సంవత్సరాలు పాలించారని, అప్పుడు అన్ని రంగాల్లో ముస్లింలు ముందున్నారన్నారు. అయితే ఈ అభివృద్ధి స్వాతంత్య్రం వచ్చిన తర్వాతనే ఆగిపోయిందని, దళితుల కన్నా ముస్లింలు చాలా వెనుకబడి ఉన్నారని ఆయన పేర్కొన్నారు.