ముస్లిం రిజర్వేషన్‌ ఏమైంది?

1

– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

హైదరాబాద్‌, ఆగస్ట్‌17(జనంసాక్షి):

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్ల ఎదుట సీపీఎం ధర్నా చేపట్టింది. హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద జరిగిన ధర్నాలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. మైనార్టీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో కెసిఆర్‌ విఫలమయ్యారని అన్నారు. కేవలం ప్రకటనలు తప్ప ఆచరణలో ఏవిూ లేదన్నారు. ముస్లిం మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదన్నారు. గిరిజనులు,మైనార్టీ రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలన్నారు. తెలంగాణలోని ప్రాజెక్టుల డిజైన్లను మారిస్తే..కేసీఆర్‌ ప్రభుత్వాన్నే మార్చేస్తామని  హెచ్చరించారు. సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లను మారిస్తే ఊరుకునేది లేదని, ప్రభుత్వం స్పందించి ప్రాజెక్టు డిజైన్ల మార్పు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే మరో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని వామపక్షనేతలు హెచ్చరించారు.  ప్రాజెక్టు అంటే నాటి వైఎస్‌ నుంచి నేటి కేసీఆర్‌ వరకు డబ్బులు సంపాదించే ఆదాయ వనరుగా మారిందని విమర్శించారు. కమిషన్లు, కాంట్రాక్టర్లు అనే దృష్టితోనే ప్రాజెక్టుల వ్యవహారం నడుస్తోందన్నారు. పాలకులకు కమిషన్లు, కాంట్రాక్టర్లకు కాసుల వర్షమని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి జలవిధానంపై అవగాహన లేదన్నారు.  దిక్కుమాలిన పాలనతో కేసీఆర్‌ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాడని పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీల పోరాటాలను దిక్కులేనివంటున్న కేసీఆర్‌ పాలనే దిక్కుమాలిందని విమర్శించారు.