ముహూర్తం ఖరారు

– 12న ఉదయం 9గంటలకు భేటీ కానున్న ట్రంప్‌, కిమ్‌
– ఇరువురి చర్చలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ దేశాలు
వాషింగ్టన్‌, జూన్‌5(జనం సాక్షి) : ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల భేటీకి ముహూర్తం ఖరారైంది. సింగపూర్‌ కాలమానం ప్రకారం ఈ నెల 12న ఉదయం 9 గంటలకు ఇరువురు నేతలు సమావేశం కానున్నట్లు అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం ప్రకటించింది. ట్రంప్‌, కిమ్‌ భేటీ కోసం ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు శ్వేతసౌధం విూడియా కార్యదర్శి శారా సాండర్స్‌ తెలిపారు. ఉత్తర కొరియా అణ్వస్త్ర రహితంగా మారేందుకు చర్యలు ప్రారంభిస్తే ఆ దేశంతో తప్పకుండా భేటీ అవుతానని గతంలో ట్రంప్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో సింగపూర్‌ వేదికగా జూన్‌ 12న వీరి సమావేశం జరగనున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా.. ఈ భేటీని రద్దు చేసుకుంటున్నట్లు ఇటీవల ట్రంప్‌ అనూహ్యంగా ప్రకటన చేయడం యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. దీంతో వీరి సమావేశంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఆ తర్వాత ఉత్తరకొరియా విదేశీ వ్యవహారాల మంత్రితో భేటీ అయిన ట్రంప్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. కిమ్‌తో సమావేశానికి సంసిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడంతో భేటీకి మార్గం సుగమమైంది. దీంతో ఈ నెల 12న ఉదయం 9 గంటలకు వీరి మధ్య తొలి సమావేశం జరగనుంది.
ట్రంప్‌, కిమ్‌ భేటీకి భద్రతగా గూర్ఖాలు..
ట్రంప్‌, కిమ్‌ సమావేశం నిమిత్తం సింగపూర్‌ అధికారులు దేశంలో భద్రతను ముమ్మరం చేశారు. ఇరువురు నేతలు తమ సొంత వ్యక్తిగత భద్రతా బలగాలను వెంట తెచ్చుకుంటున్నప్పటికీ.. వేదిక జరిగే ప్రాంగణం, వారు బస చేసే ¬టల్‌, నేతలు ప్రయాణించే రోడ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. సింగపూర్‌ పోలీసులతో పాటు గూర్ఖాలు కూడా ఈ భద్రతా చర్యల్లో పాల్గొంటున్నట్లు సమాచారం.
ప్రపంచంలోనే అత్యంత సాహస యోధుల తెగల్లో గూర్ఖా కూడా ఒకటి. నేపాల్‌లోని కొండల ప్రాంతాలకు చెందిన గూర్ఖాలను సింగపూర్‌ పోలీసులు ప్రత్యేకంగా నియమించుకున్నారు. కాంబాట్‌ తుపాకులు, పిస్టోళ్లు ధరించిన ఈ గూర్ఖాలు దేశంలో ముఖ్యమైన సమావేశాలు జరిగినప్పుడు భద్రతా చర్యల్లో పాల్గొంటారు.
గతంలో భారత ప్రధాని మోదీ, అమెరికా రక్షణ మంత్రి జిమ్‌ మాటిస్‌ల భేటీ సమయంలోనూ వీరు షాంగ్రీ-లా ¬టల్‌ వద్ద భద్రతా విధుల్లో ఉన్నారు. ఇక ఈ గూర్ఖాల వద్ద తప్పనిసరిగా ఖుక్రీ(పదునైన, వంపులు తిరిగిన కత్తి) ఉంటుంది. ఇది వారి సంప్రదాయ ఆయుధం. ఇది లేకుండా వారు భద్రతా చర్యల్లో పాల్గొనరు. తాజాగా ట్రంప్‌-కిమ్‌ భేటీకి కూడా వీరు భద్రతా కల్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు.