మూడు కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో

సత్వరన్యాయం కోసం కృషి చేయండి : ప్రధాని
న్యాయ వృత్తి ప్రమాణాలు దిగజారుతున్నాయి
సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ ఆందోళన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) :
దేశంలో మూడు కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు న్యాయవ్యవస్థ, న్యాయవాదులు కలిసి పనిచేయాలని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పిలుపునిచ్చారు. భార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) స్వర్ణోత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. బలమైన, సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని కోరారు. మనం నిర్దేశించుకున్న లక్ష్యం సాధించేందుకు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. దేశంలో విచారణ న్యాయస్థానాలు సహా పలు న్యాయస్థానాల్లో భారీగా కేసులు పేరుకుపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు.
న్యాయవ్యవస్థలో భాగస్వాములైన వారంతా తమ జ్ఞానం, వివేచన, అనుభవాలను రంగరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అంతర్జాతీయ అంశాలతో కూడిన కేసుల    నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాడానికి సిద్ధంగా ఉండాలని ఉన్నారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తామస్‌ కబీర్‌ మాట్లాడుతూ, న్యాయ వృత్తి ప్రమాణాలు దిగజారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థలోని బలహీనతలను గుర్తించి వాటిని సరిదిద్దాల్సి ఉందని అన్నారు. ‘మనం ఏర్పరుచుకున్న ప్రమాణాలను ఎంత వరకు పాటిస్తున్నాం. ఈ ప్రమాణాలు పూర్తిగా అందుకోవడానికి ఇంకా ఎంతదూరంలో ఉన్నామో ఆలోచించాలి.
న్యాయవృత్తిలో ప్రమాణాలు దిగజారడానికి కారణాలు చాలా ఉన్నాయి’ అని అన్నారు. ‘కొన్ని సందర్భాల్లో న్యాయవాదులు కోర్టుకు వచ్చేటప్పుడు పూర్తిగా సన్నద్ధులై ఉండరు. ఇలాంటి బలహీనతలు అధిగమించాలి’ అని పేర్కొన్నారు. కేసులు త్వరగా పరిష్కరించేందుకు లోక్‌ అదాలత్‌లు, మధ్య వర్తిత్వ వేదికలను ఏర్పాటు చేయాలని సూచించారు. పీహెచ్‌సీల తరహాలో గ్రామీణ ప్రాంతాల్లోనూ న్యాయసేవా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అటార్నీ జనరల్‌ జీఈ వాహనవతి మాట్లాడుతూ, సీనియర్‌ న్యాయవాదులుగా గుర్తించే విషయంలో కొన్ని మార్పుతు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్వినికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.